Share News

ACB Raid: ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసీల్దార్‌

ABN , Publish Date - Oct 16 , 2025 | 06:28 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం తహశీల్దార్‌తోపాటు మరో ఉద్యోగి బుధవారం లంచం తీసుకుంటూ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ACB Raid: ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసీల్దార్‌

  • సర్వే, ఆన్‌లైన్‌కు రూ.50 వేలు డిమాండ్‌

అమలాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం తహశీల్దార్‌తోపాటు మరో ఉద్యోగి బుధవారం లంచం తీసుకుంటూ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్‌ వెల్లడించిన వివరాల మేరకు.. అమలాపురం పట్టణంలోని నల్లవంతెన సమీపంలో క్రైస్తవ శ్మశానవాటిక వైపు గంధం వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. ఆ భూమి సర్వే కోసం కొంతకాలంగా అతని కుమారుడు దుర్గా కొండలరావు అమలాపురం తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఆ భూమిని సర్వే చేసి ఆన్‌లైన్‌ చేయడానికి తహశీల్దార్‌ పలివెల అశోక్‌ ప్రసాద్‌ రూ.లక్ష లంచం డిమాండ్‌ చేయగా, ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ రాము ద్వారా రూ.50 వేలకు సెటిల్‌ చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేక దుర్గాకొండలరావు రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం అశోక్‌ ప్రసాద్‌ లంచం తీసుకుంటుండగా ఆయ న్ను, రామును అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో సోదాలు చేయగా కార్యాలయంలో రూ.5,88,500 అదనంగా నగదు లభ్యమైందని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Oct 16 , 2025 | 06:30 AM