Share News

APSRTC Employees Welfare: ‘మెడికల్‌ అన్‌ఫిట్‌’లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:53 AM

మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

APSRTC Employees Welfare: ‘మెడికల్‌ అన్‌ఫిట్‌’లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు

  • ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు శుక్రవారం రవాణాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీఎ్‌సఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాక ముందు కార్పొరేషన్‌గా పాలకమండలిలో చర్చించి సొంత నిర్ణయాలు తీసుకునేది. సర్వీసులో ఉండి చనిపోయిన సిబ్బంది కుటుంబంలో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లేదా పరిహారాన్ని ఆర్టీసీ చెల్లించేది. మరోవైపు అనారోగ్యం (21 రోగాలు) బారిన పడిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయం కల్పించేంది. ఇదిలా ఉండగా... గత వైసీపీ సర్కారు ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేయడంతో కారుణ్య నియామకాలతో పాటు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగుతామని హెచ్చరించడంతో కారుణ్య నియామకాల వరకూ సమ్మతించింది. అది కూడా ఆర్టీసీలో ఖాళీల్లేవంటూ జిల్లాల్లోనే ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అయినా వందల మంది ఇప్పటికీ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిశీలించిన చంద్రబాబు ప్రభుత్వం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో కన్నా మెరుగ్గా డ్రైవర్లతో పాటు కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు సైతం ప్రత్యామ్నాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఐదు రకాల రోగాల బారినపడిన వారికి మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలిచ్చేలా నిబంధనలున్నాయి. అయితే ఆర్టీసీ సిబ్బందికి మినహాయింపునిచ్చి పాత పద్ధతిలోనే 21 రకాల అనారోగ్యాలతో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి కూడా ఉద్యోగాలిచ్చేలా సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


ఈ నిర్ణయంతో 500కు పైగా కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియనుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆర్టీసీ పాలకమండలి తీర్మానానికి ఆమోదం తెలిపి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన సీఎంకు ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఈ నిర్ణయం పట్ల ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌ రావు, ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకుడు పీవీ రమణారెడ్డి, కార్మిక పరిషత్‌ రాష్ట్ర నేత శేషగిరి, వైఎ్‌సఆర్‌ సంఘం అధ్యక్షుడు చల్లా చంద్రయ్య.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోవో విడుదలకు రవాణా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు ఎంతో సహకరించారని ఈయూ నేతలు పేర్కొన్నారు. తిరుమలరావుకు దుశ్శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Dec 27 , 2025 | 03:54 AM