కొత్తగా నోటీసులు ఇచ్చేందుకు అనుమతించండి
ABN , Publish Date - May 16 , 2025 | 12:42 AM
మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ కమిషన్ ఇచ్చిన తుది ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. భవనం కూల్చివేతకు ఇచ్చిన తుది ఉత్తర్వులతో పాటు ప్రొవిజనల్ నోటీసును ఉపసంహరించుకుంటున్నామని కోర్టుకు వివరించారు.
-మచిలీపట్నంలో వైసీపీ భవనం కూల్చివేతపై హైకోర్టును కోరిన మున్సిపల్ కమిషనర్
- అంగీకరించిన న్యాయమూర్తి
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ కమిషన్ ఇచ్చిన తుది ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. భవనం కూల్చివేతకు ఇచ్చిన తుది ఉత్తర్వులతో పాటు ప్రొవిజనల్ నోటీసును ఉపసంహరించుకుంటున్నామని కోర్టుకు వివరించారు. తాజాగా నోటీసులు ఇచ్చేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. అందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ అంగీకరించారు. వ్యాజ్యాన్ని పరిష్కరించారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ కమిషనర్ మే 9న ఇచ్చిన తుది ఉత్తర్వులను పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని అనుమతుల తరువాతే భవన నిర్మాణం చేపట్టామని, తుదిదశకు చేరుకుందని వివరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.