Nandam Abaddiah: నేతన్నలకు న్యాయం చేసింది కూటమి ప్రభుత్వమే
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:55 AM
నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసి, వారికి న్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పేర్కొన్నారు.
పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసి, వారికి న్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రూ.10వేల కోట్లతో నూతన టెక్స్‌టైల్స్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిందని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అమరావతిలో చేనేత మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నారని, చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. దీని కోసం ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిలిపేసిన త్రిఫ్ట్ నిధులను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం, 5386 మంది నేతన్నలకు రూ.5 కోట్లను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.