PM Suryaghar,: సీఎం పేరు వాడేస్తున్నారు
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:48 AM
మేం ఇంటిపై సోలార్ ప్యానళ్లు పెడతాం. అత్యంత నాణ్యమైన, వైవిధ్యమైన సోలార్ ప్యానల్ మాది. పీఎం-సూర్యఘర్ కింద మా కంపెనీ ప్యానల్‌నే తీసుకోండి’..
‘పీఎం-సూర్యఘర్’లో కంపెనీల దొడ్డిదారి ప్రమోషన్
చంద్రబాబుతో పాటు లోకేశ్ పేరూ
ఎమ్మెల్యేలకు కంపెనీ ప్రతినిధుల ఫోన్లు
ఎమ్మెల్యేల ఆఫీసు నుంచి అంటూ లబ్ధిదారులకు
వంత పాడుతున్న కొందరు మెప్మా అధికారులు
పెద్దల రెఫరెన్స్ ఉందని తప్పుడు ప్రచారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘మేం ఇంటిపై సోలార్ ప్యానళ్లు పెడతాం. అత్యంత నాణ్యమైన, వైవిధ్యమైన సోలార్ ప్యానల్ మాది. పీఎం-సూర్యఘర్ కింద మా కంపెనీ ప్యానల్‌నే తీసుకోండి’.. అంటూ ఓ కంపెనీ ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? బహుశా ఆ కంపెనీని ఎవరూ పట్టించుకోకపోవచ్చు! అదే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల అండదండలున్నాయని, వారి ఆశీస్సులతోనే పీఎం-సూర్యఘర్ ప్రాజెక్టు చేస్తున్నామని ప్రచారం చేస్తే.. ఆ కంపెనీ సోలార్ ప్యానళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఊరువాడా వాటినే తీసుకుంటారు. సోలార్ ప్యానళ్ల వ్యాపారం కోసం కొన్ని ప్రైవేటు కంపెనీలు ఇదే చేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేర్లను వాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రెఫరెన్స్‌తో వచ్చామని, మంత్రి లోకేశ్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొంటున్నాయి. తమ కంపెనీ ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేశ్ పేర్లు చెప్పి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల పేరు వాడుకుని లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు. మెప్మా అధికారులు వీడియో కాన్ఫరెన్స్, టెలీకాన్ఫరెన్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా కంపెనీలను ప్రమోట్ చేస్తున్నారు. అందులో ఎల్విన్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ కూడా ఉంది. గతంలో ఈ కంపెనీకి ప్రచార బాధ్యతలు మాత్రమే ఇచ్చామని నెడ్ క్యాప్ ఎండీ చెప్పగా.. తాము ఎవరినీ ప్రమోట్ చేయడం లేదని మెప్మా మిషన్ డైరెక్టర్ ప్రకటించారు. ‘ఆంధ్రజ్యోతి’ నిరాధార వార్తలు రాసిందని అక్కసు వెళ్లగక్కారు తప్ప నిజాలను దాచలేకపోయారు. ఇప్పుడు పక్కా ప్రణాళికతో ఎల్విన్ కంపెనీకి నియోజకవర్గాల వారీగా సోలార్ ప్యానల్ బిజినెస్ కల్పించేందుకు మెప్మా అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రైవేటు కంపెనీకి కొమ్ము
దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజల ఇళ్లపై సోలార్ విద్యుదుత్పత్తి సాధ నాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద రాష్ట్రంలో 17.50 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టింది. ఈ స్కీమ్‌పై నెడ్‌క్యా్‌పతో పాటు మెప్మా వంటి ప్రభుత్వ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సోలార్ విద్యుదుత్పత్తి ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడమే వీరి పని. అంతే తప్ప ఫలానా కంపెనీ సోలార్ ప్యానళ్లు తీసుకోండని ప్రచారం చేయకూడదు. కానీ అధికారులు జిల్లా స్థాయిలో అదే పనిచేస్తున్నారు. ఎల్విన్ గ్రూప్‌ను ఊరూవాడా ప్రమోట్ చేస్తున్నారు. ఆ కంపెనీతో కలిసి పనిచేయాలని నెడ్‌క్యాప్ ఆగస్టు 28న మెప్మాకు లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా ముందుకు వెళ్లాలని కోట్ చేస్తూ మెప్మా డైరెక్టర్ 30వ తేదీన జిల్లా పీడీలకు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మెప్మా డైరెక్టర్ ఈ నెల 6న మరో లేఖ విడుదల చేశారు. పీఎం-సూర్యఘర్ ప్రచారమే చేయాలని, మహిళలకు ఈ స్కీమ్ ప్రయోజనాలే వివరించాలని పేర్కొన్నారు. కానీ ఆచరణలో జరుగుతున్నది వేరు. ఆగస్టు 30న జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు మెప్మా నుంచి వె ళ్లిన లేఖను వెనక్కి తీసుకోలేదు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకోవద్దన్న ఎలాంటి ఆదేశాలూ జిల్లాలకు వెళ్లలేదు.
బాబు, లోకేశ్ పేర్లు చెప్పి..
కోస్తాంధ్రలో ప్రమోషన్ కోసం కొన్ని ప్రైవేటు కంపెనీలు తమకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ రెఫరెన్స్ ఉందని చెప్పుకొంటున్నాయి. పీఎం-సూర్యఘర్ స్కీమ్‌లో జరుగుతున్న గూడుపుఠాణిపై ఈ నెల 6, 7 తేదీల్లో ‘ఆంధ్రజ్యోతి’ వార్తలను ప్రచురించింది. ఎల్విన్ అనే ఓ ప్రైవేటు సంస్థతో కలిసి పనిచేయాలన్న ఆయా విభాగాల ఉత్తర్వులను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ పెద్దలు స్పందించి రెండు శాఖల నుంచి వాస్తవిక నివేదికలు తెప్పించుకున్నారు. ఆ రెండు విభాగాలు తమ తప్పేమీలేదని తప్పించుకున్నాయి. దీంతో ఎలాగైనా ఆ కంపెనికీ మేలు చేయాలనుకున్న అధికారులు కొందరు మరో మాస్టర్ ప్లాన్ వేశారు. నేరుగా జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఆ కంపెనీ ప్రతినిధితో భేటీలు ఏర్పాటు చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెఫరెన్స్‌తో వచ్చారని, కంపెనీకి మంత్రి లోకేశ్ ఆశీస్సులు ఉన్నాయని అధికారులే పరిచయ కార్యక్రమం చేస్తున్నారు. పెద్దల రెఫరెన్స్ ఉందనడంతో ఎమ్మెల్యేలు సైతం మిన్నుకుండిపోతున్నారు. ఆ కంపెనీకే సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అవగాహన ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఓ ముఖ్య అధికారికి ఫోన్ చేసి ఇది నిజమేనా? పెద్ద సార్ ఈ కంపెనీకి రెఫరెన్స్ ఇస్తున్నారా? అని ఆరా తీస్తున్నారు. ఆ అధికారి కూడా అవుననే వారికి చెబుతున్నట్లు తెలిసింది. నిజానికి ఈ ముఖ్య అధికారి అండతోనే అధికారులు ప్రైవేటు కంపెనీకి వత్తాసు పలుకున్నారని తెలిసింది.
ఎమ్మెల్యే ఆఫీసుల నుంచి ఫోన్లు
గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల పరిధిలో లబ్ధిదారులను ప్రసన్నం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసినట్లు తెలిసింది. కంపెనీల ప్రతినిధులకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు. ‘‘ఎమ్మెల్యే ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం. ఆ కంపెనీ సోలార్ ప్యానళ్లు తీసుకోండి. ఎమ్మెల్యేగారు అందరికీ చెప్పమన్నారు’’ అంటూ లబ్ధిదారులను ఓ కంపెనీకి అనుకూలంగా మారుస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. పల్నాడుకు చెందిన ఓ కీలక నేతతో సీనియర్ మంత్రి ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులు తాము ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్లు చేస్తున్నామని లబ్ధిదారులు నమ్మేలా ప్రమోషన్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఓ వ్యక్తి ఫోన్ చేస్తే, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి వచ్చినట్లుగా ట్రూ కాలర్‌లో చూపిస్తోందని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.