Share News

Municipal Projects: నిర్మాణం సరే.. నిర్వహణ ఎలా?

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:25 AM

మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ) టెండర్లలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీల్లో ఎస్‌టీపీల నిర్మాణానికి ఎన్నికల ముందు

Municipal Projects: నిర్మాణం సరే.. నిర్వహణ ఎలా?

  • మురుగునీటి శుద్ధి ప్లాంట్ల టెండర్లలో అవకతవకలు

  • మున్సిపాల్టీల్లో రూ.350 కోట్లతో 40 ప్లాంట్ల నిర్మాణం

  • ఎన్నికల ముందు హడావుడిగా వైసీపీ ప్రభుత్వం టెండర్లు

  • పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు

  • ప్లాంట్ల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించాలని డిమాండ్లు

(నరసరావుపేట-ఆంధ్రజ్యోతి)

మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ) టెండర్లలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీల్లో ఎస్‌టీపీల నిర్మాణానికి ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం హడావుడిగా నిర్వహించిన టెండర్లలో నిబంధనలు పాటించలేదు. ఈ ప్రక్రియలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్లతో 40 ఎస్‌టీపీల నిర్మాణ పనులకు టెండర్లు నిర్వహించారు. అయితే వీటి నిర్వహణ బాధ్యతల నుంచి కాంట్రాక్టర్లను తప్పించడంతో నిర్మాణం అనంతరం ప్లాంట్లను నిర్వహించే పరిస్థితి ఉండదు. ఇందుకు వెచ్చించిన రూ.వందల కోట్లు నిరుపయోగంగా మారనున్నాయి. మున్సిపాల్టీలలో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు కాల్వల ద్వారా వాగుల్లో కలుస్తోంది. ఈ మురుగుతో వాగులు, చెరువుల్లోని నీరు కూడా కలుషితమవుతోంది. పంట పొలాలకు ఈ నీటినే వినియోగించడంతో పంట ఉత్పత్తులపై ప్రభావం చూపుతోంది. నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మురుగునీటిని శుద్ధి చేసిన అనంతరమే బయటకు విడుదల చేయాలని సూచించింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎ్‌సటీపీల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఎన్నికలకు ముందే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కొన్ని మున్సిపాల్టీల్లో పనులు మొదలయ్యాయి.


నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు

ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ ప్లాంట్ల నిర్మాణంలో నిబంధనలను తుంగలో తొక్కారు. ప్లాంట్‌ నిర్మాణంలో సివిల్‌ పనుల వ్యయం 50 శాతం, యంత్రాలు, సెన్సర్లు వంటి సామగ్రి వ్యయం 50 శాతంగా ఉంది. ప్లాంట్ల నిర్మాణం వరకే టెండర్‌ నిర్వహించారు. నిర్వహణ గురించి అందులో ప్రస్తావించలేదు. గతంలో టీడీపీ హయాంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు నిర్వహించిన టెండర్లలో నిర్మాణంతో పాటు నిర్వహణ అంశాన్ని కూడా పొందుపరిచారు. గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా చిలకలూరిపేటల్లో ఎస్‌టీపీల నిర్మాణంతో పాటు పదేళ్లు నిర్వహణ బాధ్యతను కూడా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే వైసీపీ హయాంలో మాత్రం ప్లాంట్ల నిర్వహణను పుర పాలక సంస్థలకు అప్పగించే దిశగా టెండర్లు జరిగాయి. అయితే దీనికి తగిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు మున్సిపాల్టీల్లో లేరని, వాటిలో తలెత్తే లోపాలను సరిదిద్దే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు.

నాసిరకంగా పనులు

ఎస్‌టీపీల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌కు లేకపోవడంతో పనులు నాసిరకంగా చేస్తారన్న వాదన వినిపిస్తోంది. సివిల్‌ పనుల్లో పెద్దగా సమస్య లేకపోయినా మురుగు నీటిని శుద్ధి చేసే పరికరాలు, యంత్రాలు తక్కువ నాణ్యతతో కూడినవి వినియోగించే ప్రమాదం ఉంది. దీంతో ప్లాంట్‌ ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉండదని మున్సిపల్‌ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే వీటికోసం వెచ్చిస్తున్న రూ.350కోట్లు నిరుపయోగం అవుతాయన్న అభిప్రాయాన్ని ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల పాటు ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించే విధంగా గతంలో జరిగిన ఒప్పందాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ పునఃపరిశీలించాలని సూచిస్తున్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:25 AM