Illegal Encroachment: ఎలాగైనా.. కొట్టేద్దాం!
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:32 AM
ఉమ్మడి ఏపీలో పాడి రైతుల కోసం 1974లో రాష్ట్ర ప్రభుత్వం ‘డెయిరీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేసింది.
రూ.300 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను
నంద్యాల విజయ డెయిరీలో తారస్థాయికి చేరిన అక్రమాలు
35 ఎకరాల ఆస్తి అన్యాక్రాంతం?
వైసీపీ నేతలతో కుమ్మక్కయిన ఏపీ సహకార శాఖ అధికారులు
ఆ భూములు సర్కారువి కావంటూ సహకార అధికారి లేఖ.. దుమారం
దీని ఆధారంగా విక్రయానికి పావులు
ఇప్పటికే ఒప్పందాలు: టీడీపీ నేతలు
ప్రభుత్వానికి ఫిర్యాదుల వెల్లువ
నంద్యాలలోని విజయ డెయిరీకి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు పకడ్బందీగా పావులు కదులుతున్నాయి. సుమారు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం సిద్ధమవుతోంది. వైసీపీ నాయకుల నేతృత్వంలోని పాలకవర్గం అక్రమాలపై, వారికి సహకరిస్తున్న సహకార శాఖ అధికారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీలో పాడి రైతుల కోసం 1974లో రాష్ట్ర ప్రభుత్వం ‘డెయిరీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతుల నుంచి పాలు సేకరించి, విక్రయించేది. ఆ తర్వాత కార్పొరేషన్ స్థానంలో 1981లో ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్(ఏపీడీడీసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ‘విజయ బ్రాండ్’ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఈ సంస్థ ఏర్పడిన తర్వాత అంతకు ముందున్న కార్పొరేషన్ ఉద్యోగులను, రాష్ట్రం నలుమూలల వివిధ సహకార సంస్థల కింద ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఏపీడీడీసీఎఫ్‌కు బదలాయిస్తూ 1985, జనవరి 31న జీవో 67ని ఇచ్చింది. ఆయా సంస్థలు తమ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను ఏపీడీడీసీఎ్‌ఫకు బదలాయించి, లీజు ప్రాతిపదికన ఏడాదికి రూ.1000 చెల్లించాలని జీవోలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 1995లో ఏపీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ముఖ్య ఉద్దేశం సహకార సంఘాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం. ఈ చట్టం కిందకు మారాలంటే అప్పటి వరకు ఆయా సహకార సంస్థల కింద ఉన్న ఆస్తులను వాటిని లీజుకు ఇచ్చిన ఏపీడీడీసీఎఫ్‌కు అప్పగించేయాలని నిబంధన విధించింది. ఈ మేరకు నంద్యాలలోని కర్నూలు జిల్లా సహకార సంఘం తమ పరిధిలోని ఆస్తులను ఏపీడీడీసీఎఫ్‌కు అప్పగించేసి, ఆమేరకు ఎంవోయూ చేసుకుని మాక్స్ చట్టం కిందకు మారాలి. కానీ, ఎంవోయూ చేసుకోకుండానే కర్నూలు జిల్లా పాడి రైతుల సహకార సంస్థ మ్యాక్స్ చట్టం పరిధిలోకి రావడం.. కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్(కేడీఎంపీసీయూఎల్-నంద్యాల విజయ డైరీ)గా పేరు మార్చుకోవడం జరిగిపోయాయి. ఇప్పటి వరకు కూడా ఎంవోయూ చేసుకోకుండానే కర్నూలు విజయ డైరీ మ్యాక్స్ చట్టం పరిధిలో కొనసాగుతోంది. ఎంవోయూ చేసుకోకపోవడం వల్ల కర్నూలు విజయ డెయిరీ పరిధిలోని ఆస్తులన్నీ నిబంధనల ప్రకారం ఏపీడీడీసీఎ్‌ఫకు చెందుతాయి. అంటే అవన్నీ ప్రభుత్వ ఆస్తులే.
వైసీపీ హయాంలో..
2020లో వైసీపీ హయాంలో డెయిరీ పాలకవర్గం ఆస్తులను అన్యాక్రాంతం చేసే దిశగా పావులు కదపడం ప్రారంభించింది. 2020 నాటికి రూ.25 కోట్లు ఉన్న అప్పులు 2025 నాటికి రూ.100 కోట్లకు చేరాయి. మరోవైపు టర్నోవర్ రూ.100 కోట్ల నుంచి సుమారు రూ.300 కోట్లకు చేరింది. అయితే పాలకవర్గం చూపుతున్న టర్నోవర్ వాస్తవం కాదని కేవలం అప్పుల కోసమే టర్నోవర్‌ను ఎక్కువ చేసి చూపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అప్పుల ముసుగులో డెయిరీ ఆస్తులను విక్రయించాలన్న ఉద్దేశంతో పాలకవర్గం పావులు కదపడం ప్రారంభించింది. ఈ డెయిరీకి నంద్యాలలో 30, కర్నూలులో 5 ఎకరాలు ఉన్నాయి. వీటి ఖరీదు సుమారు రూ.300 కోట్ల పైచిలుకు ఉంటుంది.
డీసీవో లేఖపై అనుమానం
డెయిరీ ఆస్తులను అన్యాక్రాంతం చేయాలంటే ముందుగా అవి ప్రభుత్వ ఆస్తులు కాదు, తమకే చెందుతాయని నిరూపించుకోవాలి. ఈ ఉద్దేశంతో 2023, జూలైలో డెయిరీ యాజమాన్యం జిల్లా సహకార అధికారి(డీసీవో)కి ఓ లేఖ రాసింది. కర్నూలు డెయిరీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అని ఆ లేఖలో కోరింది. దీనికి డీసీవో సమాధానమిస్తూ.. కర్నూలు డెయిరీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ ఆస్తులు లేవని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో డీసీవోపై ఒత్తిడి తెచ్చి ఈ లేఖ తెచ్చుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే, డీసీవో ఇచ్చిన లేఖ ఆధారంగా కర్నూలు విజయ డెయిరీ యాజమాన్యం ఇప్పటికే ఆస్తులను విక్రయించేందుకు ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందాలు చేసుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాలకవర్గం అవినీతి, అక్రమాలపైన, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలపై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు అందాయి.