Financial Irregularities: ఎన్జీ రంగా వర్సిటీలో గోల్‌మాల్
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:19 AM
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిధుల గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వర్సిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన రూ.వందల కోట్ల నిధుల వినియోగానికి...
రూ.వందల కోట్ల నిధుల వినియోగంపై రికార్డులు తారుమారు
పాలక మండలి అనుమతి లేకుండానే ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు
మొత్తం 92 పోస్టులు ఉంటే ఏకంగా 105 మందికి పదోన్నతులు
ఇన్‌చార్జి వీసీపై విజిలెన్స్‌కు వర్సిటీ ఫ్రొఫెసర్ ఫిర్యాదు
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిధుల గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వర్సిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన రూ.వందల కోట్ల నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్కడే పని చేస్తున్న ఒక ఫ్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జి వీసీ శారదా జయలక్ష్మి తనకు అనుకూలమైన అధికారులను కీలకమైన స్థానాల్లో నియమించుకొని గతంలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. వీసీ అవినీతి, అక్రమాలపై ఈ ఏడాది సెప్టెంబరులో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు అప్పటి వరకు వర్సిటీ రిజిస్ర్టార్‌గా ఉన్న జి.రామచంద్రరావును విచారణ ప్రారంభం కావటానికి ముందే సెప్టెంబరు 11న తొలగించారని వెల్లడించారు. రిజిస్ర్టార్‌ను తొలగించే విషయాన్ని పాలక మండలి సమావేశంలో చర్చించాల్సి ఉండగా ఇన్‌చార్జి వీసీ సొంత నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించారని, గతంలో కోరం లేకుండానే పాలక మండలి ద్వారా తీసుకున్న అనేక నిర్ణయాలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా నోట్ ఫైల్స్ తారుమారు చేస్తున్నారని, కొన్ని పత్రాలపై పాత తేదీలతో నోట్స్ రాస్తున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
ప్రొఫెసర్ ఫిర్యాదులో ఆరోపణలు ఇవీ..
ఫైనాన్స్ కమిటీ లేకుండానే రూ.వందల కోట్ల నిధులు వినియోగించారని ఆరోపణలు రావడంతో కమిటీని హడావిడిగా ఏర్పాటు చేశారు.
ఎన్‌జీ రంగా యూనివర్సిటీ చట్టం ప్రకారం ఫైనాన్స్ కమిటీని పాలక మండలి అనుమతితో నియమించాల్సి ఉండగా, వీసీ సొంతంగా నియమించారు. దానికి చట్టబద్ధత లేదు.
ఇన్‌చార్జి వీసీపై ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్‌గా ఉన్న డాక్టర్ జి.కరుణాసాగర్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారులను రాత్రికి రాత్రి స్థానచలనం కలిగించారు.
వర్సిటీలో 92 పోస్టులు ఉంటే 105 మందికి సెప్టెంబరు 11న పదోన్నతి కల్పించారు. దీని వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయి.
వీసీని తొలగించి విచారణ చేపట్టాలి...
ఇన్‌చార్జి వీసీపై విచారణ సక్రమంగా జరగాలంటే వెంటనే ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్‌కు సదరు ఫ్రొఫెసర్ వినతిపత్రం సమర్పించారు. రంగా వర్సిటీ చట్టంలోని సెక్షన్ 11,(7) ప్రకారం... ఉద్దేశపూర్వకంగా అధికారాలను వీసీ దుర్వినియోగ పరిస్తే చాన్సలర్ వెంటనే పదవి నుంచి తొలగించాలని స్పష్టంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఇన్‌చార్జి వీసీ కోరం లేకుండా పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయటం, కీలమైన నిర్ణయాలు తీసుకోవటం, ఫైనాన్స్ కమిటీ లేకుండా రూ.వందల కోట్లు ఖర్చు చేయటం, రికార్డులు ట్యాంపరింగ్ చేయటం వంటివి అధికార దుర్వినియోగం కిందకు వస్తాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.