డీసీసీబీ లాభాలన్నీ ప్రజలకే
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:45 PM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్జిస్తున్న లాభాలన్నీ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామనీ బ్యాంకు చైర్మన ఎదురూరు విష్ణువర్దన రెడ్డి తెలిపారు.
వినూత్న డిపాజిట్లతో అత్యధిక వడ్డీ
చైర్మన డి.విష్ణువర్దన రెడ్డి
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్జిస్తున్న లాభాలన్నీ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామనీ బ్యాంకు చైర్మన ఎదురూరు విష్ణువర్దన రెడ్డి తెలిపారు. అదేవిదంగా ప్రజలకు వినూత్న డిపాజిట్ల పథకాల ద్వారా ఎక్కువ వడ్డీని వాణిజ్య బ్యాంకులకంటే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గురువారం కర్నూలు నగరంలోని జిల్లా సహకార బ్యాంకు కాన్ఫరెన్స హాలులో దీపావళి, సహాకార వారోత్సవాల సందర్బంగా 666 రోజుల కాల పరిమితితో సహకార ఉత్సవ్ అనే నూతన డిపాజిట్ల పథకాన్ని చైర్మన తన కార్యాలయంలో ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు దీపావళి సందర్బంగా వారికి ఎక్కువ ప్రయోజనాన్ని అందించే నూతన డిపాజిట్ పథకాన్ని అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లా ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు అత్యధిక ప్రయోజనాన్ని కలిగించేలా ‘నూతన ఉత్సవ్’ అనే డిపాజిట్ పథకాన్ని ప్రారంభించామన్నారు. సీనియర్ సిటిజన్సకు 8.10 వడ్డీ, సాధారణ ప్రజలకు 7.60 వడ్డీని డిపాజిట్ పథకం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం గడువు ఈ ఏడాది నవంబరు 21వ తేదీ వరకు మాత్రమే అమలులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి వెంకటకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు త్రినాథ్ రెడ్డి, ఏ.గీత తదితరులు పాల్గొన్నారు.