Share News

AP Reservoirs: ప్రాజెక్టులన్నీ ఫుల్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:03 AM

రాష్ట్రంలో ప్రధాన నీటి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. అన్ని జలాశయాలూ 98 శాతం నిండాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తి జరుగుతోంటే..

AP Reservoirs: ప్రాజెక్టులన్నీ ఫుల్‌

  • జలాశయాల్లో 98శాతం నీటి నిల్వ

  • ఎగువ నుంచి అధిక వరద వస్తే పరిస్థితేంటి?

  • ఇప్పటికే గేట్లెత్తి సముద్రంలోకి నీరు విడుదల

  • జలవనరుల శాఖ అప్రమత్తం

  • రిజర్వాయర్ల వద్ద నిరంతర నిఘా

  • ఇంజనీర్లు, లస్కర్ల మోహరింపు

అమరావతి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధాన నీటి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. అన్ని జలాశయాలూ 98 శాతం నిండాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తి జరుగుతోంటే.. దిగువకు వస్తున్న నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా కనిపిస్తుంటే.. ప్రజలకు ఆనందంగా ఉన్నా.. జలవనరుల శాఖ గుండెల్లో మాత్రం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనూహ్యంగా 2009 సెప్టెంబరులో శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరద.. భారీగా కురిసిన వర్షం దానికి గుర్తుకొస్తోంది. నాటి వరద దెబ్బకు జలాశయం ప్లంజ్‌పూల్‌ ప్రాంతం దెబ్బతింది. ఇప్పటిదాకా మరమ్మతు చేయలేకపోయారు. ఇటీవల కేంద్ర జలశక్తి సంస్థల బృందాలు అధ్యయనం చేశాయి. అయితే వాటికి ఇవ్వాల్సిన ఫీజులు జల వనరుల శాఖ చెల్లించకపోవడంతో.. కేంద్ర సంస్థలు నివేదికలు అందజేసేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ సీజన్‌లో శ్రీశైలం రిజర్వాయర్లో గరిష్ఠ స్థాయిలో ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తే మన రిజర్వాయర్లు జలాశయాలు తట్టుకోలేవని అంటున్నారు. ఇప్పటికే ప్రధాన రిజర్వాయర్ల గేట్లన్నీ ఎత్తేశారు. అవి జలపాతాలను తలపిస్తున్నా యి. నిరుడు బుడమేరు వరదను కూడా దృష్టిలో ఉంచుకుని.. జలవనరుల శాఖ అప్రమత్తమైంది. అన్ని జలాశయాల వద్ద ఇంజనీరింగ్‌ సిబ్బందిని, లస్కర్లను మో హరించి నిరంతర నిఘా చేపడుతోంది.

Updated Date - Sep 02 , 2025 | 07:04 AM