Share News

All India Bar Association: న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం అవసరం

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:43 AM

అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ (ఏబీఏపీ) న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. కోలీజియం విధానంలో నియామకాలు మరింత పారదర్శకంగా జరగాలని కోరింది.

All India Bar Association: న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం అవసరం

నియామకాల్లో పారదర్శకత కూడా ముఖ్యం

ఇందుకోసం సమగ్ర చట్టం రూపొందించాలి

ఏబీఏపీ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు

అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుతూనే ఉన్నత న్యాయవ్యవస్థలో నాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయమూర్తుల నడవడిక పర్యవేక్షణకు సమగ్రంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని అఖిల భారతీయ అధివక్త పరిషత్‌(ఏబీఏపీ) డిమాండ్‌ చేసింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేంతవరకు ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానంలోనే మరింత పారదర్శకంగా ఉన్నత న్యాయవ్యవస్థలో నియామకాలు జరపాలని సుప్రీం కోర్టును కోరింది. ఈమేరకు గుంటూరు జిల్లా, చిన్నకాకానిలో ఈ నెల 12, 13వ తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన ఏబీఏపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేసినట్లు ఏబీఏపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి సోమవారం తెలిపారు. అండమాన్‌ నికోబార్‌తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 175మంది ప్రతినిధులు, ఏపీకి చెందిన పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తీర్మానాల్లో ముఖ్యమైనవి... ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయమూర్తుల విషయంలో జవాబుదారీతనం, కోర్టుల నిర్వహణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రఖ్యాత వ్యక్తులతో శాశ్వత కమిటీ వేయాలి.


ఈ ఏడాది జూన్‌ 2025 నాటికి కమిటీ ఏర్పాటు చేయడం సాధ్యంకాకపోతే కొత్తం చట్టం అమల్లోకి వచ్చేవరకు ఫిర్యాదుల స్వీకరించడంతో పాటు విచారణ జరిపేందుకు లోక్‌పాల్‌కు అధికారం కల్పించాలి. హైకోర్టు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు హైకోర్టు, ఆయా రాష్ట్రాల్లోని సబార్డినేట్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేస్తుంటే సంబంధిత జడ్జీలను అక్కడ నుంచి బదిలీ చేయాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసేంతవరకు వారి కుటుంబ సభ్యులు అక్కడ ప్రాక్టీస్‌ చేయకూడదు. పదవీ విరమణ తర్వాత వివిధ నియమకాలు, ఆర్బిట్రేటర్‌గా నియమితులయ్యేందుకు కనీసం మూడేళ్ల సమయం ఉండాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఒకేలా ఉండాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏటా సంబంధిత కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. హైకోర్టులో ప్రతి ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒకరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉండాలి. జస్టిస్‌ వెంకటాచలయ్య హయాంలో ప్రవేశపెట్టిన విధానాన్ని ప్రస్తుతం అమలు చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:43 AM