Share News

అన్నీ తానై..!

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:56 PM

జిల్లాలో 16 బీఈడీ కళాశాలలకు సొంత బిల్డింగ్‌లు లేకపోయినా అనుమతులిప్పించడంలో ఆర్‌యూలో పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి అన్నీ తానై వ్యవహరించాడు.

   అన్నీ తానై..!

చక్రం తిప్పుతున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి

ఇష్టానుసారంగా కళాశాలల అనుమతులు

అధికారులపై ఒత్తిడి

గుడ్డిగా అనుమతులిచ్చారని విద్యార్థి సంఘాల ఆరోపణలు

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 16 బీఈడీ కళాశాలలకు సొంత బిల్డింగ్‌లు లేకపోయినా అనుమతులిప్పించడంలో ఆర్‌యూలో పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి అన్నీ తానై వ్యవహరించాడు. నన్నూరు వద్ద ఉండాల్సిన శారద బీఈడీ కళాశాలను అబ్దుల్లా కాలేజీలో, డోన్‌ లోని గాయత్రి కాలేజీలో క్రిష్ణవేణి స్కూల్‌ ఉంది. అక్కడ ఉండాల్సిన కాలేజీని శ్రీవైష్టవి డిగ్రీ కళాశాలలో ఉన్నట్లు చూపించారు. నందికొట్కూరులో శివసాయి కళాశాల లేకపోయినా అనుమతులు, నాయక్‌ బీఈడీ కళాశాల దూపాడులో ఉండాల్సి ఉండగా ఎక్కడ అనుమతులిచ్చారనేది ప్రశ్నార్థకం. సీడీసీ విభాగం నుంచి వెళ్లిన కమిటీ సభ్యులు గుడ్డిగా అనుమతులు మంజూరు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నవభారత్‌ బీఈడీ కళాశాలలో నాలుగు విద్యాసంస్థలు నడుస్తుండటం కోస మెరుపు.

తలలు పట్టుకుంటున్న అధికారులు

ఒకే భవనంలో రెండు బీఈడీ కళాశాలలకు అనుమతులపై రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ) అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 11న ‘ఒకే భవనంలో మూడు కళాశాలలు’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. బీఈడీ కళాశాలలకు సంబంధిచిన 2025 విద్యా సంవత్సారానికి అఫిలియేషన్‌ పూర్తి చేసుకుని ఏఎ్‌ఫఆర్‌సీ(అడి ్మషన్‌ అండ్‌ ఫీజ్‌ రెగ్యులేటరీ కమిటీ)కి పంపినట్లు ఆన్‌ లైన్‌ లో అప్‌లోడ్‌ చేశారు. తమకు అనుమతులు కొనసాగించాల్సిందేనని యాజమాన్యాలు పట్టు పడుతున్నట్లు సమాచారం. ఒకే భవనంలో రెండు బీఈడీ కళాశాలలకు అనుమతులకు ఆర్‌యూలోని ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి సహకరించాడు. ఈ క్రమంలో పంచలింగాలలో కొనసాగాల్సిన కళాశాలలకు అదే భవనంలో అనుమతులు కొనసాగించాలని సీఎంవో కార్యాలయం నుంచి సదరు కాంట్రాక్టు ఉద్యోగి వర్సిటీ ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా ఒత్తిడి పెంచినట్లు సమాచారం.

అనుమతులివ్వడం లేదంటూ..

ఇదే విషయంపై యూనివర్సిటీ ఉపకులపతి వి. వెంకట బసవరావు వద్ద ప్రస్తావించగా సీఎంవో కార్యాలయం నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. పైగా ఆ కళాశాలకు తాము అనుమతులివ్వడం లేదంటూ దాట వేశారు. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు కళాశాలలకు అనుమతులపై నగరంలోని ఓ కళాశాలలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రతి ఏటా జరుగుతున్న ప్రక్రియ సవ్యంగా సాగేందుకు ఉన్నతాధికారులతో చర్చలు జరిపాలని, అవసరమైతే ఉన్నత విద్యామండలిలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుందామని చర్చించినట్లు సమాచారం.

Updated Date - Oct 13 , 2025 | 11:56 PM