Share News

అప్రమత్తం!

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:27 AM

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ బాలాజీ మంగినపూడి బీచ్‌లో పర్యటించారు. సముద్రాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లాలోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారిగా అమ్రపాలిని ప్రభుత్వం నియమించింది.

అప్రమత్తం!

- మొంథా తుఫాను హెచ్చరికలు జారీ

- తీవ్ర తుఫానుగా మారే అవకాశం

- 28న మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటే ప్రమాదం!

- రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం

- జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం

- మంగినపూడి బీచ్‌లో పర్యటించిన కలెక్టర్‌ బాలాజీ

- టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు దిశానిర్దేశం

- ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా ఏర్పాట్లు

- జిల్లా ప్రత్యేక అధికారిగా అమ్రపాలి నియామకం

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ బాలాజీ మంగినపూడి బీచ్‌లో పర్యటించారు. సముద్రాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లాలోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారిగా అమ్రపాలిని ప్రభుత్వం నియమించింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా మారి, రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని స్పష్టం చేసింది. తుఫాను ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో కోస్తాతీరం వెంబడి అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి సోమవారం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో, 28వ తేదీన 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మంగినపూడి బీచ్‌లో కలెక్టర్‌ పర్యటన

కలెక్టర్‌ బాలాజీ ఆదివారం మంగినపూడి బీచ్‌లో పర్యటించారు. సముద్రపు అలల ఉధృతిని పరిశీలించారు. మత్స్యకారులు చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్వాతి, మత్స్యశాఖ జిల్లా అధికారి ఏ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాను, వరదల మధ్య తేడాను గ్రహించాలన్నారు. తుఫాను ప్రభావం జిల్లా అంతటా ఉంటుందని, అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, పెనుగాలులు వీస్తాయన్నారు. తుఫాను తీరందాటిన తర్వాత కూడా ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్‌ చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. అక్కడ తాగునీరు, భోజన వసతి, విద్యుత సౌకర్యం కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. బలమైన గాలుల తాకిడికి విద్యుత స్తంభాలు విరిగిపడి విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ పనులను పర్యవేక్షించాలన్నారు. గాలుల తీవ్రతకు రహదారుల వెంబడి చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. తుఫాను విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా అఽధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. చల్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి తుఫాను విపత్తును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

తుఫాను ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికపుడు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో 0867 252572 నెంబరుతో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో 08672 252486 నెంబరుతో, గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో 08674 243693 నెంబరుతో, ఉయ్యూరు ఆర్డ్డీవో కార్యాలయంలో 08676 232589 నెంబరుతో కంట్రోల్‌ రూమ్‌లు పనిచేస్తాయి. వీటితో పాటు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికపుడు తుఫాను కారణంగా సంభవించే పరిస్థితులను తెలుసుకోనున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 01:27 AM