Share News

Alcohol Sale: 8 నెలలు.. 20వేల కోట్లు

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:26 AM

మద్యం అమ్మకాల్లో ఏటా 8 నుంచి 10శాతం వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5శాతానికే పరిమితమైంది.

Alcohol Sale: 8 నెలలు.. 20వేల కోట్లు

స్వల్పంగా పెరిగిన మద్యం అమ్మకాలు

అక్టోబరులో భారీగా తగ్గిన సేల్స్‌

నవంబరు విక్రయాల్లో కొంత పురోగతి

మద్యం అమ్మకాలపై ‘నకిలీ’ ప్రతికూలత

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో మద్యం అమ్మకాలు రూ.20 వేల కోట్ల మార్కును దాటాయి. ఎనిమిది నెలల్లో ఈ మేరకు అమ్మకాలు నమోదయ్యాయి. మద్యం అమ్మకాలపై నకిలీ లిక్కర్‌ సహా ఎక్సైజ్‌ శాఖ చేపట్టిన చర్యలు కొంత ప్రతికూలత చూపాయి. నకిలీ మద్యం నేపథ్యంలో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. లేదంటే అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉండేదని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మద్యం అమ్మకాల్లో ఏటా 8 నుంచి 10శాతం వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5శాతానికే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో రూ.19,268 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,216 కోట్ల మద్యం విక్రయించారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల విలువ 5 శాతం పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే లిక్కర్‌ 6శాతం, బీరు 24శాతం అమ్మకాలు పుంజుకున్నాయి. కానీ, మార్కెట్‌లోకి రూ.99 లిక్కర్‌ బ్రాండ్లు రావడం, కూటమి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగిన స్థాయిలో వాటిపై ఆదాయం పెరగలేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది.

నెలకు రూ.2500 కోట్లు

ఎనిమిది నెలల్లో నెలకు సగటున రూ.2,527 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. రెండు నెలల కిందటి వరకు అమ్మకాల్లో జోరు కనిపించింది. నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్టు షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్‌ అధికారులు బెల్టులపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా ఒక్క అక్టోబరులోనే రూ.430 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయి. మరోవైపు నాటుసారా, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రత్యామ్నాయం లేక మళ్లీ మద్యం అమ్మకాలు నవంబరులో పెరిగాయి. అయినా 2024తో పోలిస్తే ఈ ఏడాది నవంబరులో అమ్మకాలు రూ.46 కోట్లు తగ్గాయి. మొత్తంగా ఎనిమిది నెలల్లో గతేడాదితో పోలిస్తే రూ.948 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి.


30 వేల కోట్లు దాటుతుందా?

2024-25లో సుమారు రూ.30 వేల కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మరో నాలుగు నెలలు ఉండగా రూ.20 వేల కోట్లు దాటింది. దీంతో సగటు అమ్మకాలను పరిశీలిస్తే మిగిలిన నెలల్లో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.30 వేల కోట్లు దాటుతాయనే అంచనా ఉంది. కాగా.. అమ్మకాల్లో విలువ పరంగా పెద్దగా వృద్ధి కనిపించకపోయినా, పరిమాణం రూపంలో బీరులో వృద్ధి కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. అలాగే క్వార్టర్‌ రూ.99కే పలు రకాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మొత్తం మద్యం అమ్మకాల్లో 20 శాతం వాటా ఆ బ్రాండ్లకే ఉంది. దీంతో అమ్మకాలు పెరిగిన స్థాయిలో ఆదాయం పెరగడం లేదు.


ఆదాయంపై అనుమానమే

2024-25లో రూ.28,842 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖ ద్వారా సమకూరింది. గతేడాది ప్రైవేటు షాపుల పాలసీ రావడంతో దరఖాస్తుల ద్వారానే రూ.1900 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆ ఆదాయం లోటు కనిపిస్తోంది. కొత్త బార్‌ పాలసీ వచ్చినా చెప్పుకోదగ్గ ఆదాయం దరఖాస్తుల రూపంలో రాలేదు. పైగా దాదాపు 300 బార్లకు దరఖాస్తులు రాలేదు. ఈ నేపథ్యంలో కేవలం మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే గతేడాది మాదిరిగా ఆదాయం రాబట్టడం సాధ్యమేనా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ అమ్మకాల ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవి కాకుండా లైసెన్స్‌ ఫీజులు, పర్మిట్‌ రూమ్‌ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. అయినా, గతేడాది స్థాయిలో ఆదాయం రాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

అమ్మకాలపై దీక్షల ప్రభావం

అక్టోబరులో కేవలం నాలుగు జిల్లాల్లోనే అమ్మకాలు పెరిగాయి. ఇక, నవంబరులో ఆ సంఖ్య 11కు చేరింది. మిగిలిన 15 జిల్లాల్లో మాత్రం అమ్మకాలు తగ్గాయి. అయ్యప్ప, భవానీ దీక్షల ప్రభావం కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాలో 11.56 శాతం, ఎన్టీఆర్‌లో 10.32 శాతం, తూర్పుగోదావరిలో 8.75 శాతం, తిరుపతిలో 6.55 శాతం, కడపలో 6.23 శాతం, గుంటూరులో 5.97 శాతం, బాపట్లలో 5.9 శాతం, కాకినాడలో 4.91 శాతం, శ్రీకాకుళంలో 4.43 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. కర్నూలు, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి జిల్లాల్లో అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరిగాయి.

Updated Date - Dec 04 , 2025 | 06:34 AM