Share News

Health Survey: మందుబాబులోయ్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:12 AM

ఒకప్పుడు మద్యపానాన్ని చెడు వ్యసనంగా భావించేవారు.రాను రానూ ఇదో ఫ్యాషన్‌లా మారిపోతోంది.తాగే వారి శాతమూ పెరుగుతోంది. మన రాష్ట్రంలో మద్యం తాగేవాళ్లంతా మగవాళ్లే.

Health Survey: మందుబాబులోయ్‌

  • రాష్ట్రంలో మందు తాగేవాళ్లంతా మగవాళ్లే

  • మహిళల్లో ఈ సంస్కృతి చాలా తక్కువ

  • పురుషులు 31.2శాతం.. మహిళలు 0.2శాతం

  • జాతీయ కుటుంబ వైద్య సర్వేలో వెల్లడి

  • మొత్తం కోటిన్నరమందికి పైగా అలవాటు

  • వారిలో రోజూ తాగేవారు 50 లక్షల మంది

  • సగటున నెలకు 10 క్వార్టర్లు తాగుతున్నారు

  • ఈశాన్య రాష్ట్రాల్లో పోటీపడుతున్న మహిళలు

  • అరుణాచల్‌ప్రదేశ్‌లో 17.2శాతం.. సిక్కింలో 14.8శాతం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు మద్యపానాన్ని చెడు వ్యసనంగా భావించేవారు.రాను రానూ ఇదో ఫ్యాషన్‌లా మారిపోతోంది.తాగే వారి శాతమూ పెరుగుతోంది. మన రాష్ట్రంలో మద్యం తాగేవాళ్లంతా మగవాళ్లే.ప్రస్తుత రాష్ట్ర జనాభా దాదాపు 5.4 కోట్ల మందిలో 31.2 శాతం మంది అంటే.. 1.56 కోట్ల మంది పురుషులు మందు తాగుతున్నారు.ఇక మహిళల విషయానికొస్తే కేవలం 0.2 శాతం అంటే.. దాదాపు లక్ష మందికి మాత్రమే మద్యం అలవాటు ఉంది.మన దేశంలో ఈశాన్య,మరికొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు మద్యం తాగే సంస్కృతి చాలా తక్కువ.జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 2019-2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో మద్యం వినియోగంపై చేసిన సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది.ఈశాన్య రాష్ర్టాల్లో మహిళలు మందు తాగే సంస్కృతి ఎక్కువగా ఉంది.అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా 17.2 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు.ఆ తర్వాత సిక్కింలో 14.8 శాతం, అసోంలో 5.5 శాతం,త్రిపురలో 4.3 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇక తెలంగాణలో 4.9 శాతం, గోవాలో 4.8 శాతం,లద్దాఖ్‌లో 3.6శాతం మహిళలకు మందు అలవాటు ఉన్నట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్‌, చండీగఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌,తమిళనాడు,ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో అతి తక్కువ మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు.


రోజూ తాగేవారు మూడోవంతే

రాష్ట్రంలో కోటిన్నర మందికి పైగా మందు అలవాటున్నా..మద్యం అమ్మకాల ఆధారంగా చూస్తే అందులో మూడోవంతు మంది మాత్రమే రోజూ మందు తాగే అవకాశం కనిపిస్తోంది.కోటి మందికిపైగా వారానికోసారి లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మందు తాగుతున్నట్టు అంచనా.రాష్ట్రంలో నెలకు సగటున 34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడవుతోంది. ఒక్కో కేసులో 48 క్వార్టర్‌ సీసాలు ఉంటాయి.ఈ లెక్కన మొత్తం 16.32 కోట్ల క్వార్టర్లు అమ్ముడవుతున్నాయి.తాగేవారి సంఖ్య (1.57 కోట్లు)తో పోల్చి చూస్తే సగటున నెలకు 10.5 క్వార్టర్లు తాగుతున్నారు. కానీ వారిలో రోజూ మందు తాగేవారు, అందులోనూ రోజుకు రెండు క్వార్టర్లు తాగే దినసరి కూలీలూ ఉన్నారు.ఇలాంటివారు దాదాపు 50 లక్షల మంది ఉంటారని అంచనా. మరో కోటి మందికిపైగా అప్పుడప్పుడు మందు తాగుతున్నారు.


యూత్‌లో బీర్‌ ట్రెండే

యూత్‌లో ఎక్కువగా బీర్‌ ట్రెండే కనిపిస్తోంది. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో ఏకంగా 129 శాతం బీర్‌ అమ్మకాలు పెరిగాయి. గత ప్రభుత్వంలో బీర్‌లో పాపులర్‌ బ్రాండ్లు దొరక్కపోవడంతో యువతలో అనేక మంది గంజాయి, ఇతర మత్తుకు అలవాటుపడ్డారు.కూటమి ప్రభుత్వంలో అన్ని కంపెనీల బీర్లు అందుబాటులోకి రావడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. నెలకు 20 లక్షల కేసులకు పైగా బీర్‌ అమ్ముడవుతోంది.బీర్లు దాదాపుగా యువతే తాగుతున్నారు.వీరిలో అక్కడక్కడా ముఖ్యంగా నగరాల్లో అమ్మాయిలూ ఉండే పరిస్థితి ఉంది.గత కొన్నేళ్లుగా డ్రాట్‌ బీర్‌ అమ్మకాలు కూడా పెరిగాయి. అంటే ఎప్పుడో తయారు చేసింది కాకుండా అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చే బీర్‌ తాగేందుకు యువత ఇష్టపడుతోంది.


ఏపీలో ఆ కల్చర్‌ లేదు

గ్రామీణ,పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో భిన్నమైన సంస్కృతి ఉంటుంది.అక్కడ పబ్‌లు అందుబాటులో ఉంటాయి.పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా పబ్‌ కల్చర్‌కు అలవాటుపడ్డారు.అలాంటి పబ్‌ల సంస్కృతి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా విస్తరించలేదు.

Updated Date - Aug 09 , 2025 | 04:13 AM