Literacy Campaign: నిరక్షరాస్యుల కోసం ‘అక్షరాంధ్ర’
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:22 AM
రాష్ట్రంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘అక్షరాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏటా 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడం లక్ష్యం
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘అక్షరాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర పథకం ‘ఉల్లా్‌స’తో అనుసంధానం చేసుకుని, అక్షరాంధ్రను అమలుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా అందులో పొందుపరిచారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు 81లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. వారందరినీ అక్షరాస్యులుగా మార్చడం లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమం అమలుచేస్తారు. ఏడాదికి 25లక్షల మందికి శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా మార్చనున్నారు. వారికి మాతృభాష చదవడం, రాయడం, కూడికలు తీసివేతలు లాంటి చిన్నపాటి లెక్కలపై అవగాహన కలిగేలా వారికి ప్రాథమికాంశాలను బోధిస్తారు. అలాగే డిజిటల్, ఫైనాన్షియల్, ఆరోగ్యం, న్యాయ అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. వలంటీర్లను నియమించి వారి ద్వారా వయోజనులకు బోధిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను ఇందుకోసం వినియోగిస్తారు. ఉదయం, సాయంత్రం, వారాంతాల్లో తరగతులు నిర్వహిస్తారు. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇస్తారు.