Kothacheruvu: అక్షరం అండగా..తో పరిష్కారం
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:30 AM
‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు పట్టణ ప్రజలకు శ్మశాన వాటికకు స్థలం...
కొత్తచెరువులో శ్మశానవాటికకు స్థలం, దారి
కొత్తచెరువు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు పట్టణ ప్రజలకు శ్మశాన వాటికకు స్థలం కేటాయింపుతో పాటు, దారి సమస్య పరిష్కారమైంది. జనవరి 28న నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ సభలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కొత్తచెరువు బీసీ కాలనీ వాసులు కోరారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించి, పుట్టపర్తి ప్రధాన రహదారి పక్కన, నల్లగొండ సమీపంలోని సర్వే నం.1451లో 3 ఎకరాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చినా శ్మశాన వాటికకు దారి మాత్రం చూపలేదు. ఈ నెల 2న కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ‘అక్షరం అండగా..’ సభలో ఈ సమస్యను స్థానికులు ప్రస్తావించారు. వెంటనే దారి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సూచించారు. దీంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు 30 అడుగుల రోడ్డు ఏర్పాటు పనులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు శనివారం చేపట్టారు.