Vishnu Deo Sai: అజాత శత్రువు వాజపేయి
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:49 AM
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అజాత శత్రువని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’లో భాగంగా తూర్పుగోదావరి...
విలువలకు పట్టం కట్టిన గొప్ప నేత.. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్
రాజమహేంద్రవరం, కాకినాడల్లో వాజపేయి విగ్రహావిష్కరణ
రాజమహేంద్రవరం/కాకినాడ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అజాత శత్రువని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన వాజపేయి కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వాజపేయి దేశానికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు అటల్‌నగర్‌గా నామకరణం చేశామన్నారు. కాగా, దేశానికి దిశానిర్దేశం చేసిన నేత వాజపేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కాకినాడ రామారావుపేట మూడులైట్ల కూడలిలోని మున్సిపల్ వాటర్ వర్క్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వాజపేయి విగ్రహాన్ని ఆదివారం ఆయన మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విలువలకు పట్టంకట్టిన నాయకుడు వాజపేయి అన్నారు. నిష్కళంక చరిత్ర కలిగిన ఆయన పాలనను గుర్తు చేసేలా మోదీ మరింత సమర్థంగా పాలిస్తూ దేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన ఉంచుతున్నారని పేర్కొన్నారు.