Share News

వాయు‘గండం’!

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:50 AM

దిత్వా తుపాను వాయుగుండం ప్రభావం జిల్లా రైతులను వణికిస్తూనే ఉంది. సోమవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో ధాన్యం రాశులపై పరదాలు కప్పి ఉంచారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు, గోనె సంచులకు ఎత్తి ధాన్యం మిల్లులకు చేరవేసేందుకు అవకాశం లేకుండా పోయింది. తీవ్ర తుఫాను వాయుగుండంగా మారినా, దీని ప్రభావంతో ఈ నెల 4వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా లేక పోవడంతో గత రెండు రోజులుగా ఆఫ్‌లైన్‌లో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లులకు తరలించిన ధాన్యం ధరను రానున్న రోజుల్లో ఎంత మేర నిర్ణయిస్తారనే విషయంపైనా రైతుల్లో ఆయోమయం నెలకొంది.

వాయు‘గండం’!

- భయపెడుతున్న దిత్వా తుఫాను

- 4వ తేదీ వరకు కోస్తా తీరం వెంబడి వర్షాలు పడే అవకాశం

- మిల్లుల వద్ద బారులుతీరిన ధాన్యం లోడు వాహనాలు

- బ్యాంకు గ్యారెంటీ రెట్టింపు చేయకపోవడంతో జనరేట్‌ కాని ట్రక్‌షీట్‌లు

- ఆ్‌ఫ్‌లైన్‌లో భారీగా మిల్లులకు తరలింపు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

దిత్వా తుపాను వాయుగుండం ప్రభావం జిల్లా రైతులను వణికిస్తూనే ఉంది. సోమవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో ధాన్యం రాశులపై పరదాలు కప్పి ఉంచారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు, గోనె సంచులకు ఎత్తి ధాన్యం మిల్లులకు చేరవేసేందుకు అవకాశం లేకుండా పోయింది. తీవ్ర తుఫాను వాయుగుండంగా మారినా, దీని ప్రభావంతో ఈ నెల 4వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా లేక పోవడంతో గత రెండు రోజులుగా ఆఫ్‌లైన్‌లో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లులకు తరలించిన ధాన్యం ధరను రానున్న రోజుల్లో ఎంత మేర నిర్ణయిస్తారనే విషయంపైనా రైతుల్లో ఆయోమయం నెలకొంది.

జనరేట్‌ కాని ట్రక్‌ షీట్లు

జిల్లాలోని 176 మిల్లుల యజమానులు ఽధాన్యం కొనుగోలు చేసేందుకు నవంబరులో బ్యాంకు గ్యారెంటీలు(బీజీ) చెల్లించారు. ఆ నెలలో కొనుగోలు చేసిన ధాన్యంతో ఈ బీజీలు అయిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో త్వరితగతిని ధాన్యం కొనుగోలు చేసేందుకు 1:1 పద్ధతిలో అధికారులు అనుమతులు ఇచ్చారు. జిల్ల్లాలో సోమవారం నాటికి 1.70 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిల్లర్లు చెల్లించిన బీజీలు అయిపోవడంతో రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) నుంచి మిల్లులకు ధాన్యం పంపేందుకు ట్రక్‌ షీట్‌లు జనరేట్‌ చేయడానికి సర్వర్‌ సహకరించడంలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరి కోతలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం రావడంతో ధాన్యం కొనుగోళ్లు కొంతమేర నిలిచిపోయాయి. ధాన్యం ఏ మిల్లుకు పంపాలనే అంశంపై తేల్చుకోలేక ఆర్‌ఎస్‌కే సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఉదాహరణకు ఒక మిల్లు యజమాని కోటి రూపాయలను బీజీగా చూపితే 1:1 పద్ధతిలో రెండు కోట్ల రూపాయల వరకు ధాన్యం కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు.

ఎఫ్‌సీఐకు లెవీ బియ్యం ఇచ్చేందుకు ఆలస్యంగా అనుమతులు

జిల్లాలో ధాన్యం కొనుగోలు, ధాన్యం మరపట్టిన తర్వాత ఎఫ్‌సీఐకు లెవీ బియ్యం ఇచ్చేందుకు త్వరితగతిన అనుమతులు ఇస్తామని మిల్లర్ల అసోషియేషన్‌ నాయకులతో జరిగిన తొలి సమావేశంలో అదికారులు హామీ ఇచ్చినట్టు తెలిసింది. కానీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన 15 రోజుల తర్వాత ఎఫ్‌సీఐకు లెవీ బియ్యం ఇచ్చేందుకు అనుమతులు వచ్చాయని మిల్లర్లు అంటున్నారు. ఎఫ్‌సీఐ గూడౌన్‌లకు ఒక్కో మిల్లు నుంచి లెవీ బియ్యం 20 లారీలను పంపితే, అందులో 10 లారీలు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారని, మిగిలిన లారీలు ఆలస్యంగా దిగుమతి కావడంతో బిల్లులు సకాలంలో జమ కావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే బీజీలు చూపామని, ఎఫ్‌సీఐ నుంచి సకాలంలో నగదు జమ కాకపోవడంతో మళ్లీ బీజీలు చెల్లించడం కష్టంగా మారిందని మిల్లర్లు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చేందుకు రాష్ట్ర గోడౌన్‌లలో నిల్వ ఉంచేందుకు సీఎంఆర్‌ బియ్యం తీసుకోవడం ఇంతవరకు ప్రారంభించలేదని, తీసుకుంటే బిల్లులు త్వరితగతిన వచ్చేవని, ఈ నగదుతో తాము బీజీలు చూపడానికి అవకాశం ఉండేదని చెబుతున్నారు. సీఎంఆర్‌ బియ్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని, లేనిపక్షంలో బీజీని 1:1 పద్ధతికి బదులుగా 1:2 పద్ధతికి మార్చాలని మిల్లర్లు కోరుతున్నారు.

నేలవాలుతున్న వరి

దిత్వా తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న చిరు జల్లుల కారణంగా కోతకు సిద్ధమైన వరి తడిచి, బరువెక్కి నిదానంగా నేలవాలిపోతోంది. వర్షంలో కంకులు నానిపోయి గింజల్లో నూకశాతం పెరిగే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటే రాశులుగా పోసి, పరదాలు కప్పిన ధాన్యం ఆరబెట్టేందుకు అవకాశం ఉండదని, ఈ ధాన్యం రంగుమారుతుందని ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ సరిహద్దులో నిలిచిపోతున్న ధాన్యం లారీలు

తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపారులతో మాట్లాడుకుని పలువురు స్థానిక వ్యాపారులు అక్కడకు ధాన్యం తరలిస్తున్నారు. గరికపాడు చెక్‌ పోస్టు దాటిన తర్వాత ధాన్యం లారీలను తెలంగాణ అధికారులు మీ ధాన్యం మీ రాష్ట్రంలోనే విక్రయించుకోవాలని చెబుతూ నిలిపి వేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. కానీ తెలంగాణ నుంచి మండపేట, తదితర ప్రాంతాలకు వస్తున్న ధాన్యానికి ఒకశాతం సెస్‌ కట్టించుకుని అనుమతి ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని జిల్లాలోని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:51 AM