వాయు‘గండం’!
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:49 AM
జిల్లా వాసులను వాయుగుండం వణికిస్తోంది. సముద్ర నీటిమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింతగా బలపడటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మంగళవారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బుధవారం నాటికి అల్పపీడన ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాతీరం వెంబడి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
- రానున్న రెండు రోజులపాటు దక్షిణ కోస్తాతీరం వెంబడి భారీవర్షాలు
- బంగాళాఖాతంలో సముద్ర నీటి మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున అల్పపీడన ద్రోణి కేంద్రీకృతం
- నేడు వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరిక
- 25వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- వరిని వెంటాడుతున్న తెగుళ్ల బెడద
జిల్లా వాసులను వాయుగుండం వణికిస్తోంది. సముద్ర నీటిమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింతగా బలపడటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మంగళవారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బుధవారం నాటికి అల్పపీడన ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాతీరం వెంబడి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లా వాసులకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడటంతో భారీ వర్షాలు పడనున్నాయి. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గాలిలో తేమశాతం పెరిగింది. దీంతో కోతకు సిద్ధంగా, కంకులు పాలు పోసుకునే దశలో ఉన్న వరికి తెగుళ్ల బెడద అధికమవుతుందని రైతులు చెబుతున్నారు. పురుగులతో పాటు, దోమపోటు అధికమైతే వరి దుబ్బులు బలహీన పడతాయని రైతులు అంటున్నారు. వర్షం కురిస్తే తెగుళ్ల నివారణకు పురుగు మందులు స్ర్పే చేయడానికి అవకాశం ఉండదని చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షంతో పాటు, సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న నాలుగైదు రోజుల పాటు ఎలాంటి విపత్తును చూడాల్సి వస్తుందోననే భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో వరిపైరుకు ఎలాంటి ఇబ్బంది లేదని, రానున్న రోజుల్లో భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీస్తే, ఈత దశలోఉన్న వరికి సుంకు రాలిపోతుందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం పలుచోట్ల కంకులు పాలుపోసుకునే దశలో, మరికొన్ని చోట్ల కోతకు సిద్ధంగా వరి ఉందని చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిస్తే పైరు నేలవాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
పొంగి ప్రవహి స్తున్న డ్రైనేజీలు
వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన పంట కాల్వలకు నీటి విడుదలను నిలిపివేశారు. వర్షం కారణంగా ప్రధాన డ్రెయిన్‌లు గుండేరు, లజ్జబండ, వడ్లమన్నాడు, ఉప్పుటేరు తదితర డ్రెయున్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి. దివిసీమలోని కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం సౌత మండలంలోని పంట పొలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువస్తోంది. కోడూరు మండలంలోని హంసలదీవి, దింటిమెరక, పాలకాయతిప్ప, ఊటగుండం గ్రామాలకు ఈస్ట్ చానల్ 14-బి, 15, 17, 18 నెంబర్ల పంట కాల్వల ద్వారా సాగునీరు విడుదల అవుతుంది. కోడూరుతో పాటు నాగాయలంక మండలం సముద్రతీరంలోని గ్రామాల పరిధిలోని సముద్రపు కరకట్టకు ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిస్‌లకు గేట్లు అమర్చకపోవడంతో సముద్రపు ఆటు సమయంలో ఎంతనీరు దిగువకు పోతోందో, సముద్రపు పోటు సమయంలో అంతకంటే నీరు అధికంగా పొలాల్లో వస్తోంది. కోడూరు మండలంలోని హంసలదీవి, పాలకాయతిప్ప తదితర గ్రామాల్లో ఇప్పటివరకు చాలామటుకు పొలాల్లో నాట్లు వేయలేదు. నాట్లు వేసిన కొద్దిపాటి విస్తీర్ణంలోని పొలాల్లోకి సముద్రపు పోటు రావడంతో నీరు ఎగదన్ని పొలాల్లోని వరిపైరు మునిగిపోయింది. మచిలీపట్నం సౌత మండలంలోని మాలకాయలంక నుంచి కోన, పల్లెతుమ్మలపాలెం గ్రామాల వరకు ఆరు అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు ఉండగా, వీటి గేట్లు కొట్టుకుపోయాయి. దీంతో న్యూకోన డ్రెయిన్‌తోపాటు, దీనికి అనుబంధంగా ఉన్న డ్రెయిన్‌లలో వర్షపు నీరు ఎగదన్ని పొలాల్లో నీరు నిలబడి ఉంది. మరింతగా వర్షం కురిస్తే మచిలీపట్నం సౌత మండలంలోని వరి పొలాలు నీట మునుగుతాయని రైతులు అంటున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు కృత్తివెన్నులో అత్యధికంగా 10.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చల్లపల్లిలో 2.2 మిల్లీమీటర్లు, జిల్లా సగటు వర్షపాతం 1.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతలవారీగా పలు ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీవర్షం కురిసింది.