Visakhapatnam Airport: విశాఖలో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:02 AM
విశాఖపట్నం నుంచి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ముప్పు తప్పింది.
బయలుదేరిన కొద్దిసేపటికే ఢీకొన్న పక్షి
దీంతో వెనక్కి మళ్లింపు.. విమానంలో 103 మంది
విశాఖపట్నం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ముప్పు తప్పింది. 103 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.38 గంటలకు ఈ విమానం విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. కేవలం తొమ్మిది నిమిషాల్లోనే... 2.47 గంటల సమయంలో తిరిగి వెనక్కి వస్తున్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ సమాచారం అందించారు. సరిగ్గా మూడు గంటలకు సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ పక్షి విమానంలో రెండో నంబరు ఇంజన్‌ను ఢీకొట్టిందని, దానివల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో విమానాన్ని వెనక్కి తీసుకువచ్చారని విమానాశ్రయం వర్గాలు తెలిపాయి.