Recruitment Process: ఎయిడెడ్ పోస్టుల భర్తీలో అక్రమాలకు చెక్
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:14 AM
ఎయిడెడ్ పాఠశాలల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నాన్ మైనారిటీ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎయిడెడ్ పోస్టుల...
ఇకపై సీబీటీ ద్వారానే భర్తీ.. ఇంటర్వ్యూలు పూర్తిగా రద్దు
సవరణ నిబంధనలు విడుదల
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ పాఠశాలల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నాన్ మైనారిటీ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎయిడెడ్ పోస్టుల భర్తీ ఇకపై కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ఆధారంగా మాత్రమే చేపట్టాలని, ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన నిబంధనల ప్రకారం వంద మార్కులకు సీబీటీ పరీక్ష జరుగుతుంది. దీనిలో 80 మార్కులకు సీబీటీ, 20 మార్కులకు ‘టెట్’ వెయిటేజీ ఇస్తారు. ప్రస్తుతం ఎయిడెడ్ విద్యా పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి అర మార్కు చొప్పున పదేళ్లకు గరిష్ఠంగా 5 మార్కులు కేటాస్తారు. పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలు ఉండవు. బోధనేతర సిబ్బంది నియామకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అన్ని ఖాళీలను పత్రికా ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలి. అయితే, ఆ జిల్లాలో ఎక్కడా ఎయిడెడ్‌లో మిగులు పోస్టులు లేవని నిర్ధారించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మిగులు పోస్టులు ఉంటే ఆ ఖాళీల్లో సర్దుబాటు చేస్తారు. పోస్టుల భర్తీకి ఖచ్చితంగా అధీకృత అథారిటీ అనుమతి పొందాలని నిబంధనల్లో పేర్కొన్నారు. డీఎస్సీ తరహాలోనే మెరిట్ కమ్ రోస్టర్ విధానం ఉంటుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిటీ
నాన్ మైనారిటీ, మైనారిటీ పాఠశాలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఈ కమిటీలో ఎడ్యుకేషనల్ ఏజెన్సీ అధ్యక్షుడు లేదా నామినీ, విద్యా సంస్థ హెచ్‌ఎం, డీఈవో ఆమోదించిన ఇద్దరు సబ్జెక్టు నిపుణులు, డీవైఈవో ర్యాంకుకు తక్కువకాని ఒక విద్యాశాఖ అధికారి ఉంటారు. వీరిలో ఒకరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
అపోహలకు తావు లేదు
డీఎసీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటన
ఇటీవల ముగిసిన మెగా డీఎస్సీ పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరిగాయని, ఎలాంటి అపోహలకు తావులేదని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డీఎస్సీ అభ్యర్థుల్లో కొందరు తమ రెస్పాన్స్ షీట్లలో మార్కులు తప్పుగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా(సీబీటీ) జరిగాయని, అందుకే దీనిపై నమూనా పరీక్షల సౌకర్యాన్ని కల్పించి అభ్యర్థులకు అవగాహన కల్పించామన్నారు. సీబీటీ పరీక్షల్లో అభ్యర్థి ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుందన్నారు. సీబీటీపై కొందరికి అవగాహన లేకపోవడం వల్ల సమాధానాలను ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవడం, ఆప్షన్ మార్చిన తర్వాత మళ్లీ సేవ్ చేయకపోవడం లాంటి పొరపాట్లు చేశారని తెలిపారు. ఈ కారణంగా మార్కులు తక్కువగా చూపిస్తున్నాయని అపోహ పడుతున్నారని వివరించారు. పరీక్ష సమయంలో ప్రతి అభ్యర్థి చర్య ‘సెకన్ టు సెకన్’ నమోదవుతుందన్నారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించడం వల్లే 2 షిఫ్టులలో పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినట్టు తెలిపారు. మొత్తం 69 రకాల పోస్టులకు పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. వీటిలో 60 రకాల పోస్టులకు ఒకే సెషన్‌లో, 8 రకాల పరీక్షలకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించామన్నారు. కొందరు అభ్యర్థులు.. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని వివరించారు.