Share News

సాగుకు సాయం

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:58 AM

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలను సబ్సిడీపై ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రైతులకు ఎటువంటి పరికరాలు అవసరమో వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి ఐదు నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ ప్రతిపాదనల మేరకు 1,650 మంది రైతులకు రూ.2.62 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో యంత్ర పరికరాలు అందక ఇబ్బంది పడిన రైతులు కూటమి ప్రభుత్వం చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

సాగుకు సాయం

- సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

- 1,650 మంది రైతులకు రూ.2.62 కోట్లు కేటాయింపు

- 26వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తుకు అవకాశం

- గత వైసీపీ ప్రభుత్వంలో వీటి ఊసేలేదు

- కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు పెద్దపీట

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలను సబ్సిడీపై ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రైతులకు ఎటువంటి పరికరాలు అవసరమో వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి ఐదు నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ ప్రతిపాదనల మేరకు 1,650 మంది రైతులకు రూ.2.62 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో యంత్ర పరికరాలు అందక ఇబ్బంది పడిన రైతులు కూటమి ప్రభుత్వం చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలో 1.65 లక్షల హెక్టార్లలో వరి, 30 వేల హెక్టార్లలో ఉద్యానపంటలు సాగవుతున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. పవర్‌ స్ర్పేయర్లు, ట్రాక్టర్‌ పనిముట్లు తదితర చిన్నపాటి పరికరాలను సైతం గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇవ్వకపోవడంతో రైతులు పూర్తిస్థాయిలో ధర చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రైతుల సమస్యలపై దృష్టి సారించింది. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. జిల్లాకు బ్యాటరీ స్ర్పేయర్లు 450 కేటాయించగా, ఒక్కో పరికరానికి రూ.1000 సబ్సిడీ, అలాగే తైవాన్‌ స్ర్పేయర్లు 450 కేటాయించగా, రూ.36 లక్షలను సబ్సిడీగా ఇవ్వనుంది. 690 ట్రాక్టర్‌ పనిముట్లకు రూ.1.92 కోట్లను సబ్సిడీగా కేటాయించింది. 25 రోటోవేటర్లకు రూ.11.50 లక్షలను సబ్సిడీగా ఇవ్వనుంది. 15 పవర్‌ రీడర్‌లకు రూ.5.25 లక్షలను సబ్సిడీగా కేటాయించింది. 10 బ్రష్‌కట్టర్‌లకు రూ.3.60 లక్షలను సబ్సిడీగా ఇవ్వనుంది.

ఈ నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు కావాలనుకుంటే ఈ నెల 26వ తేదీలోగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమిని సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులు, సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఈ-క్రాప్‌లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నట్టుగా నమోదై ఉన్న రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తారు. రైతులు పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సంబంధిత పరికరాలకు ధరను బట్టి సబ్సిడీ పోను మిగిలిన సొమ్మును రైతుల వాటాగా చెల్లించాల్సి ఉంది. ఒక రైతుకు ఒక పరికరం మాత్రమే సబ్సిడీపై ఇస్తారు. గతంలో రైతులు వ్యవసాయ యంత్రాలు, పరికరాల కోసం మొత్తం సొమ్మును చెల్లించాలనే నిబంధన పెట్టారు. పరికరాలు ఇచ్చాక సబ్సిడీగా వచ్చే మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తామని వైసీపీ ప్రభుత్వ హయాంలో మెలికపెట్టారు. నాడు పెద్ద యంత్రాలు మాత్రమే ఇచ్చి వాటిని అద్దెకు తిప్పాలని చెప్పారు. సబ్సిడీపై యంత్రాలు పొందాలంటే ఐదారుగురు సభ్యులతో కూడిన రైతు గ్రూపులు సకాలంలో మొత్తం నగదు చెల్లించలేక ఇబ్బందులు పడిన దాఖలాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా చిన్నపాటి వ్యవసాయ పరికరాలను అందించేందుకు అవకాశం కల్పించడంతో చిన్నపాటి పరికరాలు రైతులకు అందుబాలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇచ్చే పరికరాలు 2024-25 సంవత్సరానికి సంబంధించినవని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరిన్ని పరికరాలు రైతులకు అందిస్తామని వ్యవసాశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:58 AM