Cardiac Treatment: గుండెకు ఏఐ చికిత్స..
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:28 AM
ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మరణాలను తగ్గించేందుకు నూతన వైద్య సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.
అంతర్జాతీయంగా ప్రెసిషన్ మెడిసిన్.. రీజనరేటివ్ మెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి
మనదేశంలోనూ ఊపందుకున్న పరిశోధన.. వైద్యం అందుబాటులోకి వస్తే విప్లవమే
వ్యక్తులు వందేళ్లకుపైగా జీవించే అవకాశం
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మరణాలను తగ్గించేందుకు నూతన వైద్య సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ప్రెసిషన్ మెడిసిన్, రీజనరేటివ్ వైద్యం ద్వారా వ్యక్తి వంద సంవత్సరాలకుపైబడి జీవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.నూతన విధానంలో గుండె సమస్యలను ముందుగానే గుర్తించి, దానికి అనుగుణంగా గుండెను రీజనరేట్ చేసే వైద్య విధానాలు అందుబాటులో రానున్నాయి.సోమవారం అంతర్జాతీయ ‘హార్డ్ డే’ సందర్భంగా హృదయ పరిరక్షణ, వైద్యంపై ప్రముఖ వైద్యులు కీలక సూచనలు చేశారు.
ప్రెసిషన్ మెడిసిన్..
ప్రెసిషన్ మెడిసిన్.. అనేది వ్యక్తిగతీకరించిన చికిత్స. జీనోమిక్ డేటా, జీవనశైలి, పరిసరాల ఆధారంగా ఈ విధానంలో చికిత్స అందిస్తారు. ఒకే వ్యాధి అందరికీ ఒకే విధంగా ఉండదు. వ్యక్తుల జన్యువుల ఆధారంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆయా వ్యక్తులకు వేర్వేరు ఔషధాలు, డోసులు అవసరమవుతాయి. ఈ క్రమంలో జీనోమిక్ డేటా ఆధారంగా శరీర తత్వాన్ని బట్టి మందుల వాడకం ఉంటుంది. మరోవైపు కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా డ్రగ్ టాక్సిసిటీ, షుగర్, బీపీ, గుండె జబ్బు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం రోగి సమస్య చెబితే, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఏ అవయవంలో సమస్య ఉందో గుర్తిస్తారు. కానీ, సమస్య ఆధారంగానే నేరుగా అనారోగ్య సమస్యలను గుర్తించే విధంగా ఏఐ అందుబాటులోకి వచ్చింది. మెషిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, కంప్యూటర్ విజన్ సహకారంతో క్లినికల్ నిర్ణయాలు మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల అనారోగ్య సమస్యను ముందే గుర్తించడం వల్ల చికిత్స సులువు కావడంతోపాటు రోగి ఆయా సమస్యల నుంచి త్వరిగతిన వంద శాతం బయటపడే అవకాశాలున్నాయి.
ఐపీఎస్‌సీ విప్లవం..
రీజనరేటివ్ మెడిసిన్‌లో ఇండ్యూస్‌డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్(ఐపీఎస్‌సీ ) అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఎంబ్రయోనిక్ స్టెమ్ సెల్స్‌తో వచ్చే సమస్యలు, ఇమ్యూన్ రిజెక్షన్ సమస్యలను ఐపీఎస్‌సీ ద్వారా తప్పించుకోవచ్చు. రోగి చర్మ బయాప్సీ సెల్స్‌ను ల్యాబ్‌లో రీప్రోగ్రామ్ చేసి లివర్, కిడ్నీ, గుండె మొదలైన అవయవాలను తిరిగి సృష్టించవచ్చు. దీనివల్ల ఇతర వ్యక్తుల అవయవాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం అన్ని దేశాల్లో అవయవాల కోసం బ్రెయిన్ డెడ్ దాతలపై ఆధారపడుతున్నారు. కానీ, అవయవాలు అవసరమైన స్థాయిలో దాతలు లేరు. ఫలితంగా అవయవాలు అందుబాటులో లేక చికిత్స మధ్యలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో కూడా హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎక్కువ మంది ఉంటున్నారు. రోగి చర్మ బయాప్సీ సెల్స్‌ను ల్యాబ్‌లో రీప్రోగ్రామ్ చేసి లివర్, కిడ్నీ, గుండె మొదలైన అవసరమైన అవయవాలను తిరిగి సృష్టించే వెసులుబాటు అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరుతుందని నిపుణులు భావిస్తున్నారు. రోగి కణజాలం ఉపయోగించడం వల్ల సురక్షితమైన, వ్యక్తిగతీకరించిన చికిత్స సాధ్యమవుతుంది. ఐపీఎస్‌సీ సాంకేతిక ద్వారా రోగి శరీరానికి కొత్త అవయవాలను తయారు చేసి, భవిష్యత్తులో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది.
రీజనరేటివ్ మెడిసిన్..
రీజనరేటివ్ మెడిసిన్‌ని శరీర కణజాల పునర్నిర్మాణం అంటారు. స్టెమ్ సెల్స్, జీన్ థెరిపి, టిష్యూ ఇంజనీరింగ్ ద్వారా దెబ్బతిన్న అవయవాలను తిరిగి పునరుద్ధరించే విధానం అందుబాటులోకి వస్తోంది. దీనిద్వారా గుండెపోటు తర్వాత గుండె కండర కణజాలం(హార్ట్ మజిల్ టిష్యూ) పునర్నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అన్ని దేశాల్లో గుండెపోటు సమస్యలు తీవ్రమయ్యాయి. గత పదేళ్ల నుంచి 30 ఏళ్ల వారిలో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గుండెపోటు మరణాల సంఖ్యా భారీగా ఉంది. ఈ సమస్యల నివారణకు హార్ట్ మజిల్ టిష్యూ పునర్నిర్మించుకోవడంపై అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైనా, రష్యా దాదాపు పూర్తిచేశాయి. మన దేశంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
టిష్యూ పునరుద్ధరణే నూతన విధానం
ఎవరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందో ముందే అంచనా వేసి డ్యామేజ్ అయిన హార్ట్ మజిల్ టిష్యూలు పునరద్ధరించడమే నూతన వైద్య విధానం. సైన్స్, జెనోమిక్స్, ఏఐ కలిసినప్పుడు మానవ ఆరోగ్యానికి సరికొత్త విప్లవం ఆవిర్భవిస్తుంది. కానీ, ప్రతి ఒక్కరూ గుండెను కాపాడుకోవడం కోసం సరైన జీవనశైలి అలవాటు చేసుకుంటే మంచిది. దీనికి తోడు త్వరలో అందుబాటులోకి వచ్చే ప్రెసిషన్ మెడిసిన్, రీజనరేటివ్ మెడిసిన్ మానవ జీవితాన్ని శతాధిక సంవత్సరాల పాటు ఆరోగ్యవంతంగా నిలబెట్టగలుగుతాయి.
- డాక్టర్ రమేశ్ బాబు, చీఫ్ కార్డియాలజిస్ట్,
ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్