Share News

AI Voice Scam: ఏఐ కాల్స్‌తో బురిడీ

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:57 AM

జడ్పీటీసీ టికెట్‌ పేరిట డబ్బులు దండుకోవడానికి ఓ మోసగాడు మాజీ మంత్రి దేవినేని ఉమా అవతారం ఎత్తా డు. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన...

AI Voice Scam: ఏఐ కాల్స్‌తో బురిడీ

  • సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా గొంతులతో టీడీపీ నేతలకు టోకరా

విజయవాడ/ సత్తుపల్లి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ టికెట్‌ పేరిట డబ్బులు దండుకోవడానికి ఓ మోసగాడు మాజీ మంత్రి దేవినేని ఉమా అవతారం ఎత్తా డు. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన మోరకొండ ఏడుకొండలు త్వరలో జరిగే ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీకి అవకాశం ఇవ్వాలని ఉమాను కోరారు. ఈ క్రమంలో ఉమా డీపీ ఉన్న నంబరు నుంచి 8న ఏడుకొండలికి వీడియోకాల్‌ వచ్చింది. అందులో ఉమాలాగే ఉన్న వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ చేస్తానని చెప్పాడు. కాసేపటికి మామూలు కాల్‌ చేసి ‘అన్న (చంద్రబాబు) మాట్లాడతారు’ అని చెప్పాడు. అనంతరం చంద్రబాబు స్వరంతో ఓ వ్యక్తి కాన్ఫెరెన్స్‌ కాల్‌లో మాట్లాడారు. జడ్పీటీసీగా అవకాశం ఇస్తానని, పేరు డైరీలో రాసుకున్నానని చెప్పి కాల్‌ కట్‌ చేశాడు. తర్వాత మొదటి వ్యక్తి ఫోన్‌ చేసి రూ.లక్ష ఫోన్‌పే చేయాలని డిమాండ్‌ చేశాడు. ఏడుకొండలు డబ్బు లేదని చెప్పడంతో 9న ఫోన్‌ చేస్తానని చెప్పాడు. అయితే విజయవాడలో శుభకార్యానికి వస్తూ ఏడుకొండలు దేవినేని ఉమా ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం చెప్పడంతో గుట్టు రట్టయింది. దీనిపై బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా పేరు ఉపయోగించుకుని 20 రోజుల క్రితం భరత్‌ అనే యువకుడు జడ్పీటీసీ టికెట్‌ విషయమై డబ్బులు తీసుకురావాలని ఓ ఆశావహుడిని కంకిపాడు పిలిపించుకున్నట్టు పోలీసులు తెలిపారు.


సత్తుపల్లిలో మరో మోసం

తెలంగాణలో ఓ అగంతకుడు ఏఐతో మోసగించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ అభిమానికి గతనెల 30న ఫోన్‌ చేసి తాను దేవినేని ఉమా పీఏనంటూ పరిచయం చేసుకొని.. ఉమా వీడియో కాల్‌లో మాట్లాడతారని చెప్పాడు. ఉమాను పోలిన వ్యక్తితో మాట్లాడించాడు. పేద పిల్లల చదువుకు సాయం చేయాలని కోరడంతో.. బాధితుడు రూ.35 వేలు బదిలీ చేశాడు. వారం తర్వాత సదరు వ్యక్తినుంచి మళ్లీ ఫోన్‌ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బి-ఫాం ఇస్తామని, చంద్రబాబు మాట్లాడతారని చెప్పారు. వీడియో కాల్‌లో చంద్రబాబును పోలిన వ్యక్తి ఆయనతో మాట్లాడి, అభినందించారు. చంద్రబాబును కలిపిస్తానని సదరు వ్యక్తి నమ్మించాడు. సత్తుపల్లి నుంచి 18 మంది 8న విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం వరకూ హోటల్‌ వద్ద వేచి చూసినా ఎవరూ రాకపోవడంతో ఆ వ్యక్తికి ఫోన్‌ చేశారు. అదే సమయంలో బిల్లు చెల్లించాలని హోటల్‌ యాజమాన్యం డిమాండ్‌ చేసింది. వాగ్వాదం జరగడంతో పోలీసుల వచ్చారు. విషయం తెలుసుకొని ఉమాకు ఫోన్‌ చేశారు. తాను ఎవరికి వీడియో కాల్‌ చేయలేదని ఆయన స్పష్టం చేయడంతో మోసం బట్టబయలైంది. ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

Updated Date - Oct 11 , 2025 | 05:57 AM