వచ్చేది ఏఐ విప్లవం: లోకేశ్
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:49 AM
జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడి, ఇష్టపడి చదవాలని విద్యార్థులకు మంత్రి లోకేశ్ ఉద్బోధించారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడి, ఇష్టపడి చదవాలని విద్యార్థులకు మంత్రి లోకేశ్ ఉద్బోధించారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ ఐటీ సంస్థ ‘సైయంట్’ ఫౌండేషన్ సహకారంతో రూ.8కోట్ల వ్యయంతో విశాఖ జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్‌లను శుక్రవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమానికి చంద్రంపాలెం, వాడపాలెం, ఎండాడ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 1,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ విప్లవంతో తెలుగువారికి లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు రాబోయేది ఏఐ విప్లవం అన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారమే కారణమని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలపై దృష్టిసారిస్తానని చెప్పారు. టీచర్లకు బోధనేతర పనులు తగ్గించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లు త్వరలో విధుల్లో చేరుతాయని లోకేశ్ ప్రకటించారు. విద్యా వ్యవస్థలో అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమస్యలు వస్తే పరిష్కరించుకుందామని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. పిల్లలంతా బాగా చదువుకుని రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. 1991లో హైదరాబాద్‌లో ఇన్ఫోటెక్ కంపెనీ స్థాపించిన బీవీఆర్ మోహన్‌రెడ్డి తరువాత దానిని సైయంట్ కంపెనీగా పేరు మార్చారని చెప్పారు. ప్రస్తుతం 16వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని, భారత్‌తో పాటు 22 దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వివరించారు. రూ.8కోట్ల సీఎ్‌సఆర్ నిధులతో 50 ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటుచేశారని ప్రశంసించారు. పాఠశాల వ్యవస్థ బలోపేతానికి మోహనరెడ్డి అధ్యక్షతన ఐదుగురితో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో లోకేశ్ సెల్ఫీలు దిగారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.