Facial Recognition: ఏఐ చేతిలో నేరగాళ్ల చిట్టా..
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:11 AM
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల అభిప్రాయమిది. దీన్ని నిజం చేసి చూపించారు విజయవాడ పోలీసులు.
విజయవాడలో 100 ఎఫ్‌ఆర్‌సీలు
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతున్న చిత్రాలు
టెక్నాలజీ సాయంతో గుర్తిస్తున్న నగర పోలీసులు
దసరా ఉత్సవాల్లో నేరాల అడ్డుకట్టకు కృషి
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల అభిప్రాయమిది. దీన్ని నిజం చేసి చూపించారు విజయవాడ పోలీసులు. నేరాల నియంత్రణ, నేరగాళ్ల గుర్తింపునకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇప్పుడు శరన్నవరాత్రుల్లో పోలీసులకు ఆయుధాలుగా మారాయి. దసర ఉత్సావాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేసుకుని చేతివాటం చూపించే దొంగలకు కళ్లెం వేయడానికి ఎఫ్‌ఆర్‌సీ (ఫేషియల్ రికగ్నైజ్ కెమెరా)లు ఉపయోగిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఈనెల 22న ప్రారంభమైన ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడో నేరచరిత్ర ఉన్న నేరగాళ్లంతా బెజవాడలో వాలిపోతారు. అలాంటి వారిని పోలీసులు ఎఫ్‌ఆర్‌సీ ద్వారా గుర్తిస్తున్నారు.
వీడియోనెటిక్స్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం
విజయవాడ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు గతేడాది ఆగస్టులో సురక్ష ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 6వేల సీసీ కెమెరాలను అమర్చారు. నిందితులను గుర్తించడానికి జిల్లాలో 248 ఎఫ్‌ఆర్‌సీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో 100కు పైగా కెమెరాలు విజయవాడలోనే ఉన్నాయి. వివిధ కేసుల్లోని నిందితుల ఫొటోలు, వేలిముద్రలతోపాటు వారు ఎక్కడెక్కడ నేరాలు చేశారనే వివరాలను సీసీటీఎన్‌ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం)లో పొందుపరిచారు. నిందితులు, నేరగాళ్లను గుర్తించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వీడియోనెటిక్స్ అనే సాఫ్ట్‌వేర్‌ను సీసీటీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేశారు. ఎఫ్‌ఆర్‌సీ కెమెరాలను కూడా ఈ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించారు. రైళ్లు, బస్సుల్లో వచ్చిన నేరగాళ్లను, ఆలయం పరిసర ప్రాంతాల్లో సంచరించే దొంగలు ఈ కెమెరాల కంట పడగానే అవి వారి ముఖాలను స్కాన్ చేస్తాయి. ఈ చిత్రాలన్నీ మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీడియోవాల్‌పై కనిపిస్తుంటాయి. స్ర్కీన్‌పై భాగంలో కెమెరా చిత్రీకరించిన ముఖాలు, కిందిభాగంలో సాఫ్ట్‌వేర్ డేటాలో ఉన్న ఫొటోలు కనిపిస్తాయి. ఆ రెండూ సరిపోలినప్పుడు పక్కనే పర్సంటేజీ చూపిస్తుంది. ఇది 97 శాతంగా చూపిస్తే ఆ నేరగాడు కెమెరాకు సమీప ప్రాంతంలోనే ఉన్నట్టు నిర్ధారించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది వైర్‌లెస్ సెట్‌లో అక్కడున్న సీసీఎస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు.