Share News

Agriculture Dept: ఎరువుల కొరత రానీయొద్దు

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:33 AM

రైల్వే గూడ్స్‌ ర్యాక్‌ పాయింట్ల నుంచి రిటైల్‌ వ్యాపారులకు నేరుగా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని ఎరువుల కంపెనీలు ప్రకటించాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

Agriculture Dept: ఎరువుల కొరత రానీయొద్దు

  • డీలర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సూచన

  • అనకాపల్లిలో రైల్వే గూడ్స్‌ ర్యాక్‌ పాయింట్‌ ఏర్పాటు

  • డీలర్లకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్న కంపెనీలు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రైల్వే గూడ్స్‌ ర్యాక్‌ పాయింట్ల నుంచి రిటైల్‌ వ్యాపారులకు నేరుగా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని ఎరువుల కంపెనీలు ప్రకటించాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. దీనివల్ల రిటైల్‌ వ్యాపారులకు రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎరువుల తయారీదారులు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు, అధికారుల సమావేశం జరిగింది. రవాణా ఖర్చులు, ఇతర సమస్యలపై వీరి మధ్య చర్చలు జరిగాయి. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తామని, డీలర్లకు నేరుగా ఉచిత రవాణా కల్పిస్తామని కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. డిల్లీరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అనకాపల్లి, మదనపల్లి, హిందూపురంలో రైల్వే గూడ్స్‌ ర్యాక్‌ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, అనకాపల్లికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని,. మిగతా వాటికి త్వరలో అనుమతులు వస్తాయని చెప్పారు. ఎక్కడైనా ఎరువుల కొరత ఉందని డీలర్లు తెలిపితే.. వెంటనే తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. అవసరానికి మించి యూరియా వాడితే భూ సాంద్రత దెబ్బతింటుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు డైరెక్టర్లు విజయలక్ష్మి, కృపాదాస్‌, రాష్ట్ర ఎరువుల రిటైల్‌ డీలర్ల సంఘ అధ్యక్షుడు నాగిరెడ్డి, హోల్‌సేల్‌ వ్యాపారుల సంఘ అధ్యక్షుడు నానాజీ, కోరమండల్‌ కంపెనీ జీఎం సచ్చిదానందరెడ్డి, 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 09:46 AM