Muppalla Nageswara Rao: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:33 AM
అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్ చేసింది.
హోంమంత్రిని కోరిన బాధితుల సంఘం
సచివాలయంలో వంగలపూడి అనిత సమీక్ష
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్ చేసింది. 14 వేల మంది బాధితులు స్థలాలు, పొలాలు కొనుగోలు చేయగా, వాటిని అటాచ్‌మెంట్లు చేశారని, వాటిని కేసుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్ బాధితుల సమస్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో బాధితులు తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 8 రాష్ట్రాల బాధితుల నుంచి రూ.7,386 కోట్లను అగ్రిగోల్డ్ సంస్థ కొల్లగొట్టిందన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కేసును నీరుగార్చేలా సీఐడీ చీఫ్ వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ సాయం అందక ఏపీలో 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 9.50 లక్షల మందికి రూ.3,080 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఆస్తులు అటాచ్ చేయకుండా కొందరు అడ్డుపడుతున్నారన్నారు. సిట్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లో బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి భరోసా ఇచ్చారు.