Share News

Ambedkar Konaseema District: పాతికేళ్ల తర్వాత...పద్మిని కొడుకొచ్చాడు

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:24 AM

ఏమిచ్చినా కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది. ఎంత కోపమున్నా కన్న బిడ్డలపట్ల తల్లి ప్రేమ ఏమాత్రం తగ్గదు. కొన్నేళ్ల క్రితం కు టుంబ కలహాలతో తల్లీ, కొడుకులు విడిపోయారు.

Ambedkar Konaseema District: పాతికేళ్ల తర్వాత...పద్మిని కొడుకొచ్చాడు

  • కుటుంబ కలహాలతో విడిపోయిన తల్లీకొడుకు

  • చనిపోయే లోపు బిడ్డను చూడాలని....కలెక్టర్‌కు వృద్ధురాలి అర్జీ

  • ఆచూకీ తెలుసుకుని ఇద్దరినీ కలిపిన పోలీసులు

కె.గంగవరం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఏమిచ్చినా కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది. ఎంత కోపమున్నా కన్న బిడ్డలపట్ల తల్లి ప్రేమ ఏమాత్రం తగ్గదు. కొన్నేళ్ల క్రితం కుటుంబ కలహాలతో తల్లీ, కొడుకులు విడిపోయారు. సుమారు 25 ఏళ్లుగా ఒకరినొకరు చూసుకోలేదు. ఒకరి యోగ క్షేమాలు ఒకరికి తెలియవు. వృద్ధాప్యంతో ఉన్న ఆ కన్నతల్లికి చివరిసారిగా తన కొడుకును చూడాలనే కోరికతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఇటీవల వినతిపత్రం అందజేసింది. కలెక్టర్‌ ఆదేశాలతో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్‌, సీఐ వెంకట నారాయణ సూచనలతో పామర్రు ఎస్‌ఐ ఎస్‌కె జానీబాషా తల్లీ, కొడుకులను కలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం పామర్రు గ్రామానికి చెందిన శీలం పద్మిని(80)కి ఇద్దరు కుమార్తెలు సుబ్బలక్ష్మి, వసంత, కుమారుడు శ్రీరాములు ఉన్నా రు. కుటుంబ కలహాల కారణంగా తల్ల్లి, కుమారుడు విడిపోయారు. దీంతో పద్మిని కుమార్తెల వద్ద ఉం టోంది. ప్రస్తుతం ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి గ్రామంలో ఉంటున్న చిన్న కుమార్తెతో కలిసి ఉంటోంది. చనిపోయేలోపు తన కుమారుడిని కడసారి చూసుకోవాలని తలంచి కోనసీమ జిల్లా కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో కె.గంగవరం మండలం పామర్రు ఎస్‌ఐ ఎస్‌కె జానీబాషా చర్యలు చేపట్టారు. శ్రీరాములు విశాఖపట్నంలో స్థిరపడ్డాడని, ఉపాధి కోసం కువైత్‌లో ఉంటున్నాడని గుర్తించారు. శ్రీరాములు కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు.


కువైత్‌లో ఉన్న శ్రీరాములుకు విషయం తెలియజేసి విశాఖ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ నుంచి వేమగిరిలో రెండవ కుమార్తె వసంత దగ్గర ఉంటున్న పద్మిని వద్దకు అతన్ని రప్పించి తల్లీ, కొడుకులను కలిపారు. సుమారు 25 సంవత్సరాల తరువాత తన కొడుకును చూసుకున్న ఆనందంలో పద్మిని ఉద్వేగానికి గురయ్యారు. కన్నతల్లిని చూసిన ఆనం దంలో శ్రీరాములు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా కలెక్టర్‌కు, పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 05:24 AM