Share News

గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:30 AM

మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

గిట్టుబాటు ధర కల్పించాలి
పటేల్‌ సెంటర్‌లో రాస్తారోకో చేస్తున్న సీపీఎం, రైతు సంఘం నాయకులు

సీపీఎం నాయకుల డిమాండ్‌

బస్సులకు అడ్డంగా పడుకోని నిరసన

నందికొట్కూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని సీపీఎం, ఏపీ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో పటేల్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు రాస్తారోకోను విరమించేది లేదని, రోడ్డుపై ఆర్టీసీ బస్సుల ఎదుట పడుకొని నిరసన తెలిపారు. దాంతో పోలీసులకు రైతు సంఘం నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. దీంతో వ్యవసా య అధికారులు పటేల్‌ సెంటర్‌కు వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పడంతో సీపీఎం, రైతు సంఘం నాయకులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మొక్కజొన్న పంటలు చేతికి వచ్చి నెల రోజులు అవుతుందన్నారు. క్వింటా రూ.1800లకు దళారులు కొనుగోలు చేస్తూ రైతులను దగా చేస్తున్నారన్నారు. చెప్పుకోవడానికే మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 అని కేవలం ప్రకటించారే తప్పా... ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నను కొనుగోలు చేయాని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు స్వామన్న, పక్కీర్‌ సాహెబ్‌, గోపాలకృష్ణ, బాలయ్య, ఈశ్వరమ్మ, కర్ణ, వెంకటేశ్వర్లు, ఉస్మానబాషా, రంగమ్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:30 AM