కల్తీ మద్యాన్ని అరికట్టాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:16 AM
రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని , అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మీల్ అమీర్ కోరారు.
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మీల్ అమీర్
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన
నంద్యాల టౌన, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని , అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మీల్ అమీర్ కోరారు. సోమవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సీఐ కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడం ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలపై ఆఘాయిత్యాలు, హత్యాచారాలు ఎక్కువైతున్నాయని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించకపోతే, ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన మాబున్నీసా, నాయకులు గంగిశెట్టి శ్రీధర్, జనరల్ సెక్రటరీ శశికళరెడ్డి, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణంలో వైసీపీ ర్యాలీ
నందికొట్కూరు: కల్తీ మద్యం తయారీని అరికట్టాలని నందికొట్కూరు వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని పటేల్ సెంటర్ నుంచి ఎక్సైజ్‌శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్‌శాఖ ఎస్‌ఐ జఫ్రూల్లాకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు నాయబ్, రావూఫ్, పగిడ్యాల, మిడ్తూరు జడ్పీటీసీలు దివ్య, యుగంధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మన్సూర్ , వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ నాయకుల నిరసన
ఆత్మకూరు: అనధికారిక మద్యం విక్రయాలను అరికట్టాలని, నకిలీ మద్యాన్ని అరికట్టాలని వైసీపీ మండల, పట్టణ అధ్యక్షులు రాజమోహన రెడ్డి, సయ్యద్‌మీర్ డిమాండ్ చేశారు. సోమవారం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పట్టణంలో ప్రభుత్వం చేపడుతున్న మద్యం విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్‌ఐ వెంకటస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.