Share News

CM Chandrababu: ప్రజాభీష్టం.. పాలనా సౌలభ్యం

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:11 AM

ప్రజాభీష్టం, పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా జిల్లాల పునర్‌వ్యవస్ధీకరణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగానే మంత్రివర్గ ఉపసంఘం....

CM Chandrababu: ప్రజాభీష్టం.. పాలనా సౌలభ్యం

  • జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో ఇవే ముఖ్యం: సీఎం.. పవన్‌తో కలిసి సమీక్ష

  • కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఇప్పటివరకు 12 వేల వినతులు

  • గత తప్పులన్నీ సరిచేయాలి.. కొత్త ఇబ్బందులు రాకుండా చూడాలి

  • భవిష్యత్‌లో జరిగే నియోజకవర్గాల పునర్విభజననూ దృష్టిలో పెట్టుకోవాలి

  • సీఎం దిశా నిర్దేశం.. కొత్త జిల్లాలుగా మార్కాపురం, మదనపల్లె!

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్ర జ్యోతి): ప్రజాభీష్టం, పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా జిల్లాల పునర్‌వ్యవస్ధీకరణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగానే మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపఽథ్యంలో ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశం కానుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై అధ్యయనం చేసి సిఫారసులు అందించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటి వరకు 12 వేల వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలతో ఆ శాఖ నివేదిక రూపొందించింది. దానిపై ఉపసంఘం చర్చించింది. జిల్లాల్లో పర్యటించి ప్రజాప్రతినిధులు, పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని ఉపసంఘం భావించినా అది జరగలేదు. దీంతో ఈ విషయంలో అనుకున్నంత వేగంగా చర్చ జరగలేదు. ఈ నేపఽథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం సదరు ఉపసంఘంతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్‌ జూమ్‌ మీటింగ్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఓ నివేదిక సమర్పించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటి దాకా వచ్చిన ప్రతిపాదనలు, పరిశీలనలో ఉన్న అంశాలపై ఆ శాఖ ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయిప్రసాద్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.


జగన్‌ హయాంలో లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాల విభజన చేయడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టినట్లు తెలిసింది. నాడు ప్రజాభీష్టం, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పార్లమెంటు స్థానం ప్రాతిపదికగా విభజించారని, దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నట్లు సమాచారం. ‘లోక్‌సభ సీటు ఆధారంగా జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రానికి అందులోని ఇతర ప్రాంతాలు చాలా దూరంలో ఉన్నాయి. అవి మరో జిల్లాకు దగ్గరలో, సొంత జిల్లాకు సుదూరంగా ఉన్నాయి. దీనిపై అభ్యంతరాలు వచ్చినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని ఫలితం ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు స్థానం ప్రాతిపదికగా కాకుండా అన్ని ప్రాంతాలకు దగ్గరగా జిల్లా కేంద్రం, ప్రజాభీష్టం, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేయాలి’ అని చంద్రబాబు ఉపసంఘానికి తేల్చిచెప్పారు. ఈసారి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరిగితే.. గత ప్రభుత్వం చేసిన తప్పులు, వాటివల్ల తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల కొత్త ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


ముంపు మండలాలపైనా స్పష్టత

భవిష్యత్‌లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరగాలని సీఎం అన్నారు. జనా భా, ఇతర సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికని గుర్తుచేశారు. పోలవరం ముంపు మండలాలపై కూడా స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు.


కొత్తగా 2 జిల్లాలు..!

ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. జగన్‌ ప్రభుత్వం శాస్త్రీయ విధానాలు, నిపుణుల సూచనలను కాదని..రాజకీయ ప్రయోజనాలు ఆశించి లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాల విభజన చేసింది. 13 జిల్లాలను 26గా చేసింది. అయితే అనేక జిల్లాల్లో సమస్యలున్నాయి. జిల్లా కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో మండలాలు, డివిజన్లు ఉన్నాయి. అవి మరో జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు శాస్త్రీయ పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి రెవెన్యూ శాఖ కూడా ప్రతిపాదించింది. అలాగే రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌ గా ఉన్న మదనపల్లెను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో సంప్రదించాలని ఉపసంఘం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలన్నది పెద్ద సమస్య. వాటిని ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా.. 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్‌వ్యవస్థీకరించాలని ప్రతిపాదనలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్నీ ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు టీడీపీ నేతల నుంచే వచ్చాయి. వీటన్నిటిపై ఉపసంఘం బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో చర్చించనుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ భేటీని ఖరారుచేసినట్లు తెలిసింది.

Updated Date - Oct 29 , 2025 | 03:13 AM