Share News

Land Allocation: విట్‌, ఎస్‌ఆర్‌ఎంలకు అదనంగా భూముల కేటాయింపు

ABN , Publish Date - Aug 26 , 2025 | 05:58 AM

రాజధాని అమరావతిలో ఉన్న విద్యాసంస్థలు విట్‌, ఎస్‌ఆర్‌ఎంలకు ప్రభుత్వం రెండో దశ కింద అదనపు భూములను కేటాయించింది.

Land Allocation: విట్‌, ఎస్‌ఆర్‌ఎంలకు అదనంగా భూముల కేటాయింపు

  • ఎకరా రూ.2 కోట్ల ధరకు చెరో వంద ఎకరాలు.. ఉత్తర్వులు జారీ

  • గుంటూరు టీడీపీ కార్యాలయ స్థలానికి లీజు కాలపరిమితి 99 ఏళ్లకు పెంపు

  • రాజధానిలో మౌలిక వసతులకు రూ.904 కోట్లు మంజూరు

అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఉన్న విద్యాసంస్థలు విట్‌, ఎస్‌ఆర్‌ఎంలకు ప్రభుత్వం రెండో దశ కింద అదనపు భూములను కేటాయించింది. ఎకరానికి రూ.2 కోట్ల ధర చొప్పున రెండు సంస్థలకూ చెరో వంద ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తీర్మానంతో భూములు కేటాయించడానికి సీఆర్‌డీఏకు అనుమతి మంజూరు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ రెండింటికీ 200 ఎకరాల చొప్పున రెండు విడతల్లో అందించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించి 2016లో ఉత్తర్వులిచ్చింది. అందులో భాగంగా తొలుత ఎకరా రూ.50 లక్షల చొప్పున ఒక్కో సంస్థకు వంద ఎకరాల వంతున 2017లో ఆయా సంస్థలకు రిజిస్టర్‌ చేశారు. రెండో విడత కేటాయింపులకు మొదటి దశలో పెట్టిన పెట్టుబడులు, విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టారు. ప్రస్తుతం విట్‌లో 17 వేల మంది విద్యార్థులకు 25 లక్షల చ.అడుగల భవనాలు నిర్మించగా.. మరో 19 లక్షల చ.అడుగుల స్థలంలో భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎస్‌ఆర్‌ఎంలో 11 వేల మంది విద్యార్థుల కోసం 22 లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించారు. ఇంకో 6.60 లక్షల చ.అడుగుల్లో భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ రెండు సంస్థలు రెండో విడత భూములు కేటాయింపులకు అర్హత పొందాయని సీఆర్‌డీఏ భావించింది. ఎకరాకు రూ.2 కోట్ల మార్కెట్‌ ధరతో ఆయా సంస్థలకు వంద ఎకరాల చొప్పున కేటాయించాలని సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి.


అలాగే గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కోసం గుంటూరులో కేటాయించిన మున్సిపల్‌ స్థలం 2,954 చదరపు గజాలకు లీజు కాలపరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంకోవైపు.. రాజధాని అమరావతిలోని భూసమీకరణ స్కీం జోన్లలో కీలకమైన మౌలిక వసతుల కల్పనకు రూ.904 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి జోన్లవారీగా ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని పేర్కొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 06:00 AM