Share News

Excise Police: జనార్దనరావును కస్టడీకి అనుమతించండి

ABN , Publish Date - Oct 17 , 2025 | 05:27 AM

అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావును పది రోజులు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని...

 Excise Police: జనార్దనరావును కస్టడీకి అనుమతించండి

  • నకిలీ మద్యం కేసులో మరిన్ని వివరాలు రాబట్టాలి

  • కోర్టులో ప్రాసిక్యూషన్‌ వాదనలు

విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావును పది రోజులు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాదులు కోరారు. గురువారం విజయవాడలోని ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్‌ తరఫున రాధిక, అహ్మద్‌ వాదనలు వినిపించారు. నకిలీ మద్యం ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న అంశమని, ఈ కేసు చాలా తీవ్రమైనదని పేర్కొన్నారు. విచారణలో జనార్దనరావు కొన్ని విషయాలు మాత్రమే వెల్లడించాడని, అతడితో పాటు సోదరుడు జగన్మోహనరావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జనార్దనరావు తరఫున న్యాయవాది రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోతే అది కల్తీ మద్యం కిందకు వస్తుందని చెప్పారు. జనార్దనరావు ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక ఫార్ములాతో మద్యం తయారు చేస్తే అది నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం కిందకు వస్తుందని వివరించారు. జనార్దనరావును రిమాండ్‌కు పంపే క్రమంలో ఎక్సైజ్‌ పోలీసులు అన్ని నిబంధనలను ఉల్లంఘించారన్నారు. వాద ప్రతివాదనలు విన్న అనంతరం న్యాయాధికారి లెనిన్‌బాబు తీర్పును 22వ తేదీకి వాయిదా వేశారు.


నలుగురిపై పీటీ వారెంట్‌కు అనుమతి

నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన నలుగురు నిందితులపై పీటీ వారెంట్‌ను కోర్టు అనుమతించింది. కట్టా రాజు, అంతా దాస్‌, మిథున్‌ దాస్‌, సయ్యద్‌ హజీలను కొద్ది రోజుల క్రితం తంబళ్లపల్లె ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యానికి సంబంధించి భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారు. వారిపై పోలీసులు కోర్టులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం దీనికి న్యాయాధికారి లెనిన్‌బాబు అనుమతి ఇచ్చారు. ఆ నలుగురు నిందితులను 22వ తేదీ లోగా కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Oct 17 , 2025 | 05:28 AM