Fake Liquor Scam: అద్దేపల్లి అతి తెలివి
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:49 AM
నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు అతి తెలివి ప్రదర్శించారా?. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడడం కంటే లొంగిపోవడమే మేలని భావించారా...
లొంగిపోవడానికి ముందు పక్కా స్కెచ్
ఫోన్‌ను ఆఫ్రికాలో వదిలేసిన జనార్దన్
డేటా లేని ఫోన్‌తో విజయవాడకు రాక
ఆ ఫోన్‌ను మరొకరికి ఇచ్చేసిన వైనం
గుట్టు తేల్చడంపై ఎక్సైజ్ తర్జనభర్జన
విజయవాడ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు అతి తెలివి ప్రదర్శించారా?. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడడం కంటే లొంగిపోవడమే మేలని భావించారా?. లొంగిపోయిన తర్వాత జరిగే విచారణలో ఎలాంటి ఆధారాలు ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారా?. అంటే ఎక్సైజ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైద్యం నిమిత్తం ఆఫ్రికా దేశానికి వెళ్లినట్టు వీడియోలో పేర్కొని రాష్ట్రానికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా ఎక్సైజ్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసుకున్నారు. తాను ఉపయోగించే ఖరీదైన ఫోన్‌ను మాయం చేశారు. ఈ అంశమే ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అద్దేపల్లి సుమారు రూ.లక్ష విలువ చేసే ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆఫ్రికాకి వెళ్లినప్పుడు దాన్ని వెంట తీసుకువెళ్లారు. నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చాక ఫోన్‌ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుల వద్ద వదిలేశారు. అక్కడ ఒక డమ్మీ ఫోన్‌ను తీసుకుని దాని ద్వారా సంప్రదింపులు చేసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఆ డమ్మీ ఫోన్‌ను మరో స్నేహితుడికి అప్పగించారు. విమానాశ్రయంలో జనార్దన్‌రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఎక్సైజ్ పోలీసులు విజయవాడలోని రహస్య ప్రదేశంలో విచారించారు. ఆ సమయంలో ఫోన్‌ను సీజ్ చేయాలని వారు భావించారు.
ఫోన్ గురించి ప్రశ్నించినప్పుడు ఆఫ్రికాలో దొంగలు తీసుకుపోయారని కథలు వినిపించారు. అసలు మొత్తం డేటా ఈ ఫోన్లోనే ఉందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే సమయంలో జేబులో ఉన్న ఫోన్ గురించి ప్రశ్నిస్తే హడావుడిలో ఎవరో స్నేహితుడు తీసుకున్నాడని సమాధానం ఇచ్చారు. జనార్దన్‌రావు కంటే ముందు ఆయన సోదరుడు జగన్మోహన్‌రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి ఫోన్ సీజ్ చేశారు. దానిలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి కొంత డేటాను రాబట్టారు. జనార్దన్‌రావు ఫోన్లో అంతకంటే ఎక్కువ డేటా ఉంటుందని అధికారులు భావించారు. మోసపూరిత వ్యవహారాలను చక్కబెట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న జనార్దన్‌రావు ఎక్సైజ్ పోలీసులు వేసే అడుగులను ముందుగానే గ్రహించారు. ఫోన్ సీజ్ చేస్తే గుట్టు మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుందని భావించి.. దానిని ఆఫ్రికాలో తన వారికి అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్మోహన్‌రావు ఫోన్‌ను ఎక్సైజ్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.
శ్రీనివాస వైన్స్ సీజ్
అద్దేపల్లికి భాగస్వామ్యం
విజయవాడలోని విద్యాధరపురం చెరు వు సెంటర్‌లో ఉన్న శ్రీనివాస వైన్స్‌ను భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావుకు శ్రీనివాస వైన్స్‌లో భాగస్వామ్యం ఉంది. దీంతో నకిలీ మద్యం అమ్మకాలను ఈ వైన్స్ నుంచే పెద్ద ఎత్తున చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. శ్రీనివాస వైన్స్‌లో నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టాలని, వైన్స్ ను తక్షణమే మూసివేయాలని ఇటీవల సీపీఎం నాయకులు, పలువురు స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఈ షాపును మూడు రోజుల కిందటే సీజ్ చేశారు.