Lab Report: అది నాణ్యతలేని మద్యమే
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:50 AM
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దనరావు తయారు చేసిన మద్యంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని తేలింది.
అద్దేపల్లి నకిలీ మద్యం కేసులో ల్యాబ్ నివేదిక
స్ర్టెంత్ ప్రమాణాలు పాటించకుండా తయారీ
25గా ఉండాల్సిన యూపీ 35గా నమోదు
75 ఉండాల్సిన ఓపీ 65గా నిర్ధారణ
ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదు
ఎక్సైజ్ అధికారులకు చేరిన నివేదిక
విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దనరావు తయారు చేసిన మద్యంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని తేలింది. ఈ మద్యం అత్యంత ప్రమాదకరమైనది కాకపోయినా అందులో స్ర్టెంత్(గాఢత), నాణ్యత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని రుజువైంది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ గోదాము నుంచి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సరుకు నమూనాల ల్యాబ్ నివేదిక గురువారం ఎక్సైజ్ ఉన్నతాధికారులకు చేరింది. గోదాములో మద్యం తయారీకి ఉపయోగించిన ముడిసరుకు, రసాయనాలు, స్పిరిట్‌తో పాటు తయారు చేసిన మద్యంను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం సరుకుకు సంబంధించిన 45 రకాల నమూనాలను పరీక్షల నిమిత్తం కాకినాడలోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాలకు పంపారు.
యూపీ 35-ఓపీ 65
మద్యం తయారీలో ఎంత నాణ్యత ఉంది? ఎంత స్ట్రెంత్ ఉంది? అన్న వివరాలను యూపీ(అండర్ ప్రూఫ్), ఓపీ(ఓవర్ ప్రూఫ్)లు తెలియజేస్తాయి. ప్రతి మద్యం తయారీకి ఒక సూత్రం ఉంటుంది. దాని ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మద్యం తయారు చేయాలి. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన డిస్టిలరీలు ఈ విధానాన్ని పాటిస్తాయి. డిస్టిలరీల్లో మద్యం తయారైన తర్వాత ఆ నమూనాలను ఎక్సైజ్ శాఖ ప్రయోగశాలకు పంపి పరీక్షలు చేయిస్తారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం మద్యం తయారు చేశారని ధ్రువీకరణ ఇచ్చిన తర్వాతే డిస్టిలరీల్లో సరుకును సీసాల్లో నింపుతారు. ముఖ్యంగా మద్యంలో రెండు ప్రమాణాలు యూపీ, ఓపీ ఉంటాయి. యూపీ 25గా ఉండాలి. జనార్దనరావు గోదాములో లభించిన మద్యంలో అది 35గా నమోదైంది. 100 నుంచి యూపీని తీసివేయగా వచ్చిన విలువ ఓపీని సూచిస్తుంది. ప్రమాణాల ప్రకారం 75 ఉండాల్సిన ఓపీ ఇబ్రహీపట్నంలో సీజ్ చేసిన సరుకులో 65గా ఉన్నట్టు నిర్ధారణైంది. ఈ విధంగా విలువలు నమోదైన మద్యంలో నీరు గానీ, ఇంకా ఏమైనా ద్రవపదార్థాలను గానీ మిశ్రమం చేసినట్టు సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా యూపీ 25, ఓపీ 75గా ఉన్న మద్యం తాగాలంటే అందులో నీరు, సోడా, డ్రింక్ ఇలా ఏదో ఒకటి మిశ్రమం చేసుకోవాలి. జనార్దనరావు తయారు చేసిన మద్యంలో యూపీ 35, ఓపీ 65గా ఉండడంతో ఎలాంటి ద్రవపదార్థం కలపకుండా దాన్ని తాగొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఎలాంటి నాణ్యత, గాఢతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేశారని సైంటిస్ట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
విలువలు ఎలా నిర్ధారిస్తారంటే..
మద్యం తయారీలో రెక్టిఫైడ్ స్పిరిట్, కార్మెల్(రంగు తెలియజేసే రసాయనం)తో పాటు వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. వాటిని బ్రాందీకి ఒకవిధంగా, విస్కీకి ఒకవిధంగా, రమ్ముకు ఒకవిధంగా మిశ్రమం చేస్తారు. ఈ మిశ్రమానికి సంబంధించి ప్రతి వెరైటీకి ఒక్కో ప్రత్యేక సూత్రం ఉంటుంది. డిస్టిలరీల్లో తయారైన మద్యం ప్రయోగశాలకు వెళ్లిన తర్వాత అక్కడ బిరడాల్లో పోస్తారు. ముందుగా థర్మామీటర్‌ను బిరడాలో పెట్టి ఉష్ణోగ్రతను నమోదు చేస్తారు. తర్వాత థర్మామీటర్‌ను తీసేసి హైడ్రోమీటర్ పెడతారు. ఇది ఒక రీడింగ్‌ను చూపిస్తుంది. థర్మామీటర్ చూపించిన ఉష్ణోగ్రత, హైడ్రోమీటర్ చూపించిన రీడింగ్‌ను నమోదు చేసుకుని స్కైస్ టేబుల్ ఉన్న పుస్తకంలో చూస్తారు. అందులో ఉన్న విలువలను బట్టి మద్యంలో ఉన్న గాఢతను నిర్ధారిస్తారు.