Share News

Adani Cement Plant: ఇళ్ల మధ్య సిమెంట్‌ ఫ్యాక్టరీ!

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:39 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపాన రామ్‌ కో, సాగర్‌ సిమెంట్స్‌, ఎలమంచిలి వద్ద మై హోమ్‌ తదితర...

Adani Cement Plant: ఇళ్ల మధ్య సిమెంట్‌ ఫ్యాక్టరీ!

  • విశాఖలో 1,000 కోట్లతో అదానీ ప్లాంటు.. 20 వేల మందిపై కాలుష్య ప్రభావం

  • దూరంగా పారిశ్రామిక ప్రాంతానికి తరలించాలని స్థానికుల వినతి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విశాఖ జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపాన రామ్‌ కో, సాగర్‌ సిమెంట్స్‌, ఎలమంచిలి వద్ద మై హోమ్‌ తదితర కంపెనీలు సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నాయి. సిమెంట్‌ ఫ్యాక్టరీలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. కానీ అదానీ సంస్థ పెదగంట్యాడలో నివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలను మరింత కాలుష్యంతో ముంచెత్తడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అక్కడ అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. గంగవరం పోర్టును హస్తగతం చేసుకున్న అదానీ కంపెనీ ఇక్కడ కాలుష్యం పెంచి, ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు తన పోర్టు ద్వారా ఎగుమతి చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిపై వచ్చే నెల 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. పెదగంట్యాడ గ్రామం సర్వే నంబర్లు 97పీ, 98, 99పీ, 101పీలలో సుమారు 20 ఎకరాల్లో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రతిపాదనలు వచ్చాయి. గుజరాత్‌లో అదానీకి అనుబంధ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ పేరుతో దీనిని పెడుతున్నారు. దీనిని వారు ‘గంగవరం సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌’గా వ్యవహరిస్తున్నారు. వేయి కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు నివేదించారు. ఏడాదికి రెండు యూనిట్ల ద్వారా 40 లక్షల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది స్లాగ్‌ సిమెంట్‌ అని, ఎన్‌టీపీసీ, హిందూజా పవర్‌ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్‌ తీసుకొని దాంతో సిమెంట్‌ ఉత్పత్తి చేస్తారని అధికార వర్గాల సమాచారం. ఎన్‌టీపీసీ, హిందూజా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వల్ల, వాటి నుంచి వచ్చే ఫ్లైయాష్‌తో పాలవలస, దాసరిమెట్ట, పిట్టవానిపాలెం, చేపలపాలెం తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఫ్లైయాష్‌ను నిత్యం లారీలతో తీసుకువచ్చి పెదగంట్యాడలో నిల్వ చేసి, గ్రైండింగ్‌ యూనిట్ల ద్వారా సిమెంట్‌ తయారు చేస్తారు. దీంతో కాలుష్యం మరింత పెరుగుతుంది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్‌ను లారీల ద్వారా తరలిస్తారు. దీనివల్ల విపరీతమైన ధూళి రేగుతుంది.

12.jpg


పరిసరాల్లో అన్నీ కాలనీలే

అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ పెట్టే స్థలానికి దగ్గరగా అనేక కాలనీలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది హౌసింగ్‌ బోర్టు కాలనీ. అందులో 1,500 కుటుంబాలు ఉన్నాయి. అలాగే దాని పరిసరాల్లో ఉప్పర కాలనీ, వడ్లపూడి, అగనంపూడి, దువ్వాడ, గంగవరం ఆర్‌హెచ్‌ కాలనీలు ఉన్నాయి. మొత్తంగా సుమారుగా 20 వేల మంది జనాభా ఈ పరిశ్రమ కాలుష్య ప్రభావానికి గురవుతారు. ఇలాంటి ఫ్యాక్టరీలు పారిశ్రామిక ప్రాంతాల్లో పెట్టాలి. కానీ నివాసాలకు దగ్గరగా పెడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, మనుగడను దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీని దూరంగా పారిశ్రామిక ప్రాంతానికి తరలించాలని పెదగంట్యాడ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 03:39 AM