Vijayawada Airport: ప్రభుత్వ కారులో హీరోయిన్ నిధి అగర్వాల్
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:16 AM
హరిహర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉన్న కారులో ప్రయాణించడం విమర్శలకు కారణమైంది.
సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్
అది ప్రభుత్వ కారు కాదు..: అధికార వర్గాలు
విజయవాడ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘హరిహర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్ ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని ఉన్న కారులో ప్రయాణించడం విమర్శలకు కారణమైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ జువెలరీ దుకాణాన్ని ప్రారంభించేందుకు శనివారం రాత్రి ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ బోర్డు ఉన్న కారులో ఆమె విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడే బస చేశారు. ఆ తర్వాత వేరే కారులో భీమవరం వెళ్లారు. అయితే.. ఆ బోర్డు ఉన్న కారులో ప్రయాణించడంపై వైసీపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టింది. విమర్శలపై సోమవారం ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి నిధి బుక్ చేసుకున్న కారు బ్రేక్ డౌన్ కావడంతో వేరే కారు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. ఆ కారు గతంలో ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించిందని, అగ్రిమెంట్ ముగిసినా.. నిర్వాహకుడు ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ బోర్డుని తొలగించకపోవడంతో దాన్ని ప్రభుత్వ కారుగా పొరబడ్డారని పేర్కొన్నారు.