Share News

High Court: పోసానికి హైకోర్టులో ఉపశమనం

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:50 AM

గుంటూరు జిల్లా పట్టాభిపురం, అల్లూరిజిల్లా పాడేరు, పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ పోలీసులు నమోదు చేసిన కేసులలో పీటీ వారెంట్లు అమలు కానందున పోసాని విషయంలో..

High Court: పోసానికి హైకోర్టులో ఉపశమనం

  • మూడు కేసుల్లో బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నడుచుకోండి

  • నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి

  • పోలీసులకు న్యాయస్థానం స్పష్టీకరణ

అమరావతి/నరసరావుపేట లీగల్‌/కర్నూలు లీగల్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సినీనటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఉపశమనం లభించింది. గుంటూరు జిల్లా పట్టాభిపురం, అల్లూరిజిల్లా పాడేరు, పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ పోలీసులు నమోదు చేసిన కేసులలో పీటీ వారెంట్లు అమలు కానందున పోసాని విషయంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్‌ఎస్ఎస్‌) చట్టంలోని సెక్షన్‌ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. అలాగే విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్‌ అమలు చేసి పోసానిని అదుపులోకి తీసుకున్నందున ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాసిక్యూషన్‌ అభ్యర్థన మేరకు విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు నమోదు చేసిన కేసుపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. హరినాథ్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనికిముందు పోలీసుల తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) సాంబశివప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ..కోర్టు ముందు విచారణకు ఉన్న మూడు కేసులలో పీటీ వారెంట్‌ అమలుకాలేదని తెలిపారు. భవానీపురం పోలీసులు పెట్టిన కేసులో పీటీ వారెంట్‌ అమలైనందున కేసును కొట్టివేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ..పిటిషనర్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 వ్యవస్థీకృతనేరంకింద విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్‌కు ఈ సెక్షన్‌ వర్తించదని తెలిపారు. ప్రాసిక్యూషన్‌ జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌పై ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలయ్యాయని, వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు.


గుంటూరు కోర్టు బెయిల్‌

పోసాని కృష్ణమురళికి గుంటూరు జిల్లా కోర్టు న్యాయాధికారి ఆశీర్వాదంపాల్‌ బెయిల్‌ మంజూరు చేశారు. రూ.10 వేల చొప్పున ఇద్దరు జామీన్‌ దారుల పూచీ కత్తు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 3న నరసరావుపేట పోలీసులు పీటీ వారంట్‌పై అన్నమయ్యజిల్లా రాజంపేటసబ్‌ జైలు నుంచి స్థానిక కోర్టుకు తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. అయితే, అక్కడినుంచి కర్నూలు పోలీసులు తమజిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం పోసాని అక్కడేఉన్నారు. పోసానిని కస్టడీకి అప్పగించాలంటూ ఆదోని పోలీసులు చేసిన అఽభ్యర్థనను ఆదోని అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ ఇన్‌చార్జి మెజిస్ట్రేట్‌ అపర్ణ తిరస్కరించారు.

పోసానితో కాటసాని ములాఖత్‌

కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న పోసాని కృష్ణమురళిని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కలుసుకున్నారు. పోసానిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ములాఖత్‌ అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడారు. పోసానిపైప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 06:51 AM