PM Modi AP Visit: చురుగ్గా ప్రధాని పర్యటన ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:21 AM
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నేతలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
పనులను పరిశీలించిన మంత్రులు, నేతలు అధికారులతో సమీక్షలు
పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ
కర్నూలు/విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నేతలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు సోమవారం కర్నూలుకు వచ్చి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ఇక్కడి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించింది. కర్నూలు శివారులో నన్నూరు టోల్‌ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో ప్రధాని మోదీ సభా ప్రాంగణం, పార్కింగ్, రోడ్లు తదితర ఏర్పాట్లను మంత్రులు, టీడీపీ నేతల బృందం పరిశీలించింది. పీఎం ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఏర్పాట్లు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. 3 నుంచి 4 లక్షలకు పైగా జనసమీకరణ చేయాలని నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, పుత్తా చైతన్యరెడ్డి, ఉగ్ర నరసింహా, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ నాగరాజు, పార్టీజిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, రాష్ట్ర నాయకులు కిలారి రాజేశ్, సత్యనారాయణ రాజు, దామచర్ల సత్య, బీవీ వెంకటరాముడు తదితరులు ఉన్నారు.
జనసమీకరణకు బస్సులు
ప్రధాని మోదీ పర్యటన కోసం 3,220 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. బస్సులన్నీ మంగళవారం సాయంత్రం కర్నూలులో రిపోర్టు చేయాల్సి ఉంది. అనంతరం పలు ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. 16న ఉదయం నాటికి ప్రజలను సభాస్థలికి చేర్చాల్సి ఉంటుంది. సభ ముగిసిన తర్వాత 17న సొంత డిపోలకు చేరుకుంటాయి. ఈ మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తగ్గనున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
నకిలీ మద్యానికి ఆద్యుడు జగనే: నిమ్మల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా లీడర్.. నకిలీ మద్యానికి ఆద్యుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మరో మంత్రి టీజీ భరత్‌లతో కలసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ మద్యం భాగోతాన్ని వెలుగులోకి తెచ్చిందే కూటమి ప్రభుత్వమని, అందులో తమ పార్టీ వాళ్ల పాత్ర ఉందని తెలియగానే వారిపై కఠిన చర్యలు తీసుకున్న ఘనత సీఎం చంద్రబాబుది అని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు.