Share News

నాణ్యత పాటించకుంటే చర్యలు తప్పవు

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:41 PM

మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్‌ కమిషన చైర్మన విజయ ప్రతాప్‌ రెడ్డి హెచ్చరించారు.

   నాణ్యత పాటించకుంటే చర్యలు తప్పవు
మంత్రాలయం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజనం తనికీ చేస్తున్న ఫుడ్‌ కమిషన చైర్మన

ఫుడ్‌ కమిషన చైర్మన

పాఠశాలల తనిఖీ, ఏజెన్సీపై ఆగ్రహం

మంత్రాలయం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్‌ కమిషన చైర్మన విజయ ప్రతాప్‌ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మంత్రాలయం, మాధవరం ఏపీ మోడల్‌ స్కూల్‌, చిలకలడోన కస్తూర్బా పాఠశాల, మాధవరం, రచ్చుమర్రి, మంత్రాలయం అంగనవాడీ కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే బోజనంలో ప్రమాణాలు పాటించకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై మండిపడ్డారు. మోడల్‌ స్కూల్‌లో ఆరుబయట వంట చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే కాలంచెల్లిన రాగిపిండి, బెల్లంను స్వాదీనం చేసుకున్నారు. పరిమాణం తక్కువగా ఉన్న గుడ్లను తూకం వేసి వీటిని ఏజెన్సీకి వెంటనే అప్పగించి, మార్చాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నా పాఠశాలలో సక్రమంగా అమలు కావడం లేదన్నారు. మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో వడ్డించిన సాంబారులో కందిపప్పు తక్కువగా ఉండటంతో వంట ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని ఎంఈవో మైనుద్దీన, రాగన్న, హెచఎం అంపయ్యను ఆదేశించారు. అంగనవాడీ కేంద్రాలు సంతృప్తికరంగా పని చేస్తున్నాయనీ, అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దెలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామన్నారు. అనంతరం బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసి పిల్లలకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. తనిఖీలో డీఎస్‌వో రఘువీర్‌, ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, సీడీపీవో నరసమ్మ, తహసీల్దార్‌ ఎస్‌.రవి, సివిల్‌ సప్లయ్‌ డీటీలు మహేష్‌, వలిబాషా, వీఆర్వోలు భీమన్నగౌడు, హెచఎంలు అంపయ్య, భోజరాజు, ప్రిన్సిపాల్స్‌ శాంతి, ప్రసాద్‌, అంగనవాడీ సూపర్‌వైజర్‌ నాగలక్ష్మి, టీచర్లు లావణ్యలత, తులసమ్మ, భీమేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:41 PM