Somireddy Chandramohan Reddy: బిల్లులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:48 AM
పనులు చేయకుండానే జగనన్న కాలనీ చదును పేరుతో రూ.లక్షల్లో బిల్లులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
జగనన్న కాలనీ భూముల అక్రమాలపై సోమిరెడ్డి
ముత్తుకూరు/నెల్లూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పనులు చేయకుండానే జగనన్న కాలనీ చదును పేరుతో రూ.లక్షల్లో బిల్లులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పంచాయతీ బోడిస్వామి కండ్రికలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.వంశీధర్‌రెడ్డితో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను చదును చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. పక్కనే ఉన్న దళితుల భూముల నుంచి మట్టి తోలుకుని ప్రైవేటుగా అమ్ముకున్నారు. చదును చేయకుండానే రూ.లక్షలు బిల్లులు స్వాహా చేసిన వారిని వదిలిపెట్టబోం అని హెచ్చరించారు. కాగా, ‘పులివెందుల జడ్పీటీసీని గెలిపించుకోలేని జగన్‌రెడ్డిని కలవాలంటే ఎంట్రీపాస్ ఉండాలంట! సొంత నియోజకవర్గం, సొంత మండల ప్రజలు కలవాలంటే కూడా పాస్ తీసుకోవాలంట! ఇవన్నీ నియంతపోకడలకు నిదర్శనం’ అని నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ సోమిరెడ్డి విమర్శించారు.