Education Department: పరీక్ష ఫీజుల్లోనూ బాదుడే
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:07 AM
ప్రైవేట్ పాఠశాలలు ఏదో ఒక పేరు చెప్పి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల్లోనూ భారీ బాదుడుకు దిగాయి.
టెన్త్ ఫీజులో ప్రైవేట్ పాఠశాలల దోపిడీ
వాస్తవ ఫీజు కంటే అధికమొత్తంలో వసూళ్లు
చర్యలకు పాఠశాల విద్యాశాఖ సిద్ధం
ఇకనుంచి విద్యార్థులే చెల్లించేలా కొత్త విధానం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రైవేట్ పాఠశాలలు ఏదో ఒక పేరు చెప్పి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల్లోనూ భారీ బాదుడుకు దిగాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లించాల్సింది 125 రూపాయలైతే, అందుకు చాలా రెట్లు ఎక్కువగా విద్యార్థుల నుంచి ప్రైవేటు పాఠశాలలు గుంజేశాయి. విజయవాడలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాల అయితే ఏకంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.900 వసూలు చేస్తోంది. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. పరీక్ష కేంద్రానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, దానికి అదనంగా చెల్లించాల్సిందేనని యాజమాన్యం చెబుతోంది. ఇక గుంటూరులో పలు పాఠశాలలు రూ. 500, చిత్తూరులో కొన్ని పాఠశాలలు రూ. 600 చొప్పున వసూళ్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. రవాణా, ఇతర సౌకర్యాలు పేరు చెప్పి చాలా ఏళ్లుగా ప్రైవేటు పాఠశాలలు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నా విద్యాశాఖ పట్టించుకోలేదు. ఈఏడాది కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. రూ. 125 కంటే అదనంగా ఎక్కడైనా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి ప్రకటన జారీచేశారు. నిర్దేశిత రుసుము కంటే అదనంగా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుని, జరిమానాలు కూడా విధిస్తామన్నారు. మరోవైపు ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా వసూలుచేస్తే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదనపు వసూళ్లపై ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్జేడీలకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అధికారులే స్వచ్ఛందంగా తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి ఆరా తీస్తే ఎంత కట్టించుకున్నారో తెలుస్తుందని, తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటే తక్కువ ఫిర్యాదులే వస్తాయని అంటున్నారు.
ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు
ఇప్పటివరకూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి నేరుగా విద్యార్థులే చెల్లించే అవకాశం కల్పించారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ‘బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ వెబ్‌సైట్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. తర్వాత ఫీజు చెల్లించిన విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి తెలిపితే సరిపోతుంది. అయితే ఈలోగా అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్‌ఎంలు టెన్త్ విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో ధ్రువీకరించాలి. అదనపు ఫీజుల కోసం ఎవరైనా హెచ్‌ఎం యూడైస్ ప్లస్‌తో ధ్రువీకరించకపోయినా చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
టెట్ హాల్ టికెట్లు విడుదల
97 శాతం మందికి కోరుకున్న పరీక్ష కేంద్రం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదల అయ్యాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. 2,71,692 మందికి హాల్‌టికెట్లు జారీచేశామన్నారు. 97.08 శాతం మందికి వారు కోరుకున్న తొలి ప్రాధాన్యత పరీక్ష కేంద్రాన్ని కేటాయించామన్నారు. 2.66శాతం మందికి రెండో ప్రాధాన్యత కేంద్రం, 0.2శాతం మందికి మూడో ప్రాధాన్యత కేంద్రం, 0.06శాతం మందికి నాలుగో ప్రాధాన్యత కేంద్రం కేటాయించామని వివరించారు. డిసెంబరు 10 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు.