YS Vivekananda Reddy Case: సునీతారెడ్డిది వితండవాదం!
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:12 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి వితండ వాదం చేస్తున్నారని...
తదుపరి దర్యాప్తు కోరడంపై భాస్కర్‌రెడ్డి,వైఎస్ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆక్షేపణ
ఆమె పిటిషన్ కొట్టేయాలని కోర్టుకు వినతి
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి వితండ వాదం చేస్తున్నారని నిందితులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేస్తేనే అసలు వ్యక్తులు బయటకు వస్తారని.. చాలా అంశాలపై ఇంకా విచారణ జరగాలని ఆమె దాఖలుచేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో గురువారం విచారణ కొనసాగింది. నిందితుల తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. పిటిషనర్ సునీతారెడ్డి పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ఓ వైపు వేగంగా ట్రయల్ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని.. మరోవైపు తదుపరి దర్యాప్తు అవసరమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఒకవేళ సీబీఐ తదుపరి దర్యాప్తు చేపడితే ట్రయల్ ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. ట్రయల్ ఆలస్యమవుతోందని ఆరోపిస్తూనే అది ముందుకు సాగకుండా చేస్తున్నారని తెలిపారు. అలాగే హత్య జరిగింది పులివెందులలో కాబట్టి తదుపరి దర్యాప్తు కోసం కడప కోర్టుకే వెళ్లాల్సి ఉంటుందన్నారు. అమాయకులైన తమ క్లయింట్లను నిందితులుగా చేర్చారని.. నిందితులు, నిందితులంటూ పదే పదే మీడియాలో రావడం వల్ల వారి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సునీతారెడ్డి పిటిషన్‌ను కొట్టేసి.. వేగంగా ట్రయల్ చేపట్టాలని కోరారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.