Tuni Minor Girl Assault Case: పాపం పండింది
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:43 AM
పశ్చాత్తాపమా... తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదమా... తునిలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావు (62) చెరువులో శవమై తేలాడు.
చెరువులోకి దూకి అత్యాచార నిందితుడి మృతి
బహిర్భూమి కోసం వాహనం ఆపి..దూకేసిన నారాయణరావు
న్యాయాధికారి వద్దకు వెళ్తుండగా ఘటన
చెరువులో లభించిన మృతదేహం
చావడమే కరెక్ట్: కుటుంబ సభ్యులు
కాకినాడ/తుని రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పశ్చాత్తాపమా... తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదమా... తునిలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావు (62) చెరువులో శవమై తేలాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడి మరణం కూడా అంతే సంచలనంగా మారింది. తుని పట్టణ సీఐ, ఎస్‌ఐల కథనం ప్రకారం... కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన ఒక బాలిక స్థానిక గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె సమీప బంధువు తాటిక నారాయణరావు(62) అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ బాలికను బయటకు తీసుకెళ్లేవాడు. తాతయ్య వరుసని చెప్పడంతో సిబ్బందికీ అనుమానం రాలేదు. మంగళవారం మధ్యాహ్నం నారాయణరావు మరోసారి బాలికను తీసుకెళ్లాడు. తొండంగి మండలం పైడికొండ శివార్లలో సపోటా తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్పటికప్పుడు స్పందించి కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నారాయణరావును అరెస్ట్ చేశారు. ఎఫ్‌ఐఆర్, ప్రాథమిక సాక్ష్యాల సేకరణ పూర్తి చేసి నిందితుడిని తుని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ప్రత్తిపాడు న్యాయాధికారి వద్దకు బయల్దేరారు. రాత్రి 10.30 సమయంలో తుని శివారులోని కోమటిచెరువు వద్దకు రాగానే.. నిందితుడు బహిర్భూమికి వెళ్లాలని, వాహనం ఆపాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో పోలీసులు జీపు ఆపారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో ఎస్కార్ట్ పోలీసులు దూరంగా చెట్ల కింద నిలబడ్డారు. వారు చూస్తుండగానే నారాయణరావు చెరువులోకి దూకేశాడు. తప్పించుకునే యత్నంలో ప్రమాదవశాత్తు పడిపోయాడా, పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకాడా పోలీసులకు అర్థం కాలే దు. చెరువులో అప్పటికప్పుడు గాలింపు జరిపినా ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. గురువారం ఉదయం వలలతో గాలించగా చెరువు మధ్యలో మృతదేహం లభించింది.
చనిపోవడమే కరెక్ట్ అంటూ...
పోలీసులు నారాయణరావు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. శవ పంచనామాకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతిపత్రం అవసరం కాగా... వారెవరూ సంతకం చేసేందుకు ముందుకు రాలేదు. అతడికి ఇద్దరు భార్యలు. నారాయణరావు చేసిన పనిని క్షమించలేమని కుమారుడు సురేశ్, కోడలు రాజేశ్వరి అన్నారు. ‘‘పోలీసులు ఫోన్ చేసి నారాయణరావు చనిపోయాడని తెలిపారు. అలాంటివాడు చావడమే కరెక్టనుకున్నాం’’ అని తెలిపారు. చేసిన తప్పునకు శిక్ష పడాల్సిందేనని.. అందుకే అరెస్టు చేసినా తాము స్టేషన్ వైపు రాలేదని కుమార్తె నాగలక్ష్మి చెప్పారు. బాలికపై అత్యాచారం చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు తీయకపోవడం సరికాదని మండిపడ్డారు.
బాలిక కుటుంబానికి అండగా ఉంటాం..
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ హామీ
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మైనర్ బాలికలు, మహిళలపై జరిగే అఘాయిత్యా ల విషయంలో రాజకీయాలకు అతీతంగా మానవీయకోణంలో స్పందించడం, బాధితులకు అండగా నిలవడం అందరి సామాజిక బాధ్యతని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అత్యాచారానికి గురై కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను వాట్సాప్ వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. బాలికను జాగ్రత్తగా చూసుకోవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. బాలిక ఆరోగ్యం, చదువు విషయంలో కమిషన్ అన్నివిధాలా అండగా ఉంటుందని.. కుటుంబానికి సొంతింటితోపాటు ఆర్థిక ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని శైలజ హామీ ఇచ్చారు.