Share News

Visakhapatnam: విశాఖకు యాక్సెంచర్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:16 AM

ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి మరో దిగ్గజ కంపెనీ రానుంది. టెక్‌ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్‌ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది.

Visakhapatnam: విశాఖకు యాక్సెంచర్‌

  • ఏపీకి రానున్న మరో దిగ్గజ టెక్‌ సంస్థ

  • పది ఎకరాల కోసం దరఖాస్తు

  • 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ

  • ఐటీ హబ్‌గా మారుతున్న వైజాగ్‌

  • ఇప్పటికే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ సిద్ధం

  • ప్రభుత్వ పాలసీతో కంపెనీల క్యూ

  • అనుబంధ కంపెనీలూ వస్తాయంటున్న ఐటీ నిపుణులు

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి మరో దిగ్గజ కంపెనీ రానుంది. టెక్‌ కన్సల్టెన్సీ సంస్థ ‘యాక్సెంచర్‌’ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. ఎకరా 99 పైసలు చొప్పున పది ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే విశాఖపట్నం వస్తామని, 12 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతిపాదించి నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ మంగళవారం తన కథనంలో వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి భూమి కోసం దరఖాస్తు చేశామని, ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడిస్తుందని యాక్సెంచర్‌ తెలిపినట్టు పేర్కొంది. యాక్సెంచర్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో ఆ సంస్థకు 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో మూడు లక్షల మంది భారతీయులే కావడం విశేషం. అటువంటి సంస్థ విశాఖపట్నం వస్తే.. ఉద్యోగ అవకాశాలతో పాటు ఇక్కడ ఇతర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


విశాఖకు ఐటీ దిగ్గజాలు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కంపెనీ విశాఖలో దశల వారీగా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. ఇందుకోసం రూ. 1,370 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఆ సంస్థకు ఐటీ హిల్‌ నంబరు-3పై 21.6 ఎకరాలు కేటాయించారు. క్యాంపస్‌ నిర్మించుకునే వరకు కార్యకలాపాల నిర్వహణకు మిలీనియం టవర్స్‌లో 2.08 లక్షల చ.అ. విస్తీర్ణం కలిగిన భవనం ఇచ్చారు. మరో పెద్ద ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ విశాఖలో కార్యకలాపాల నిర్వహణకు ముందుకువచ్చింది. కాపులుప్పాడలో 21.31 ఎకరాలు కోరగా వీఎంఆర్‌డీఏ ద్వారా సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక్కడ రూ.1,582.98 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పడంతో వారికి కూడా ఎకరా 99 పైసలకే లీజుకు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థ ద్వారా దశల వారీగా ఎనిమిది వేల మందికి ఉపాధి లభిస్తుంది. 2029 మార్చి నాటికి కమర్షియల్‌ ఆపరేషన్లు ప్రారంభిస్తుంది.


ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి

కొవిడ్‌ తరువాత ఐటీ సంస్థలన్నీ ద్వితీయ శ్రేణి నగరాలపై ఆసక్తి చూపుతున్నాయి. భూమి తక్కువ ధరకు లభించడం, తక్కువ జీతాలకు నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉండడం, ట్రాఫిక్‌ సమస్యలు లేకపోవడంతో పెద్ద కంపెనీలు విశాఖ వంటి నగరాలవైపు మొగ్గుచూపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా బలంగా పనిచేస్తోంది. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తే ఎకరా భూమిని కేవలం 99 పైసలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేశ్‌ ప్రకటించడం, ఇచ్చిన మాట ప్రకారం టీసీఎస్‌కు భూమిని కేటాయించడంతో మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాట పడుతున్నాయి.

Updated Date - Sep 24 , 2025 | 04:18 AM