ACB Raids Sub Registrar Residences: ఇళ్లల్లోనూ నోట్ల కట్టలు!
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:58 AM
రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తోంది...
సబ్‌రిజిస్ట్రార్లు, సిబ్బంది నివాసాల్లో ఏసీబీ సోదాలు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తోంది. నవంబరు మొదటి వారంలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు అక్రమాలు, ఉల్లంఘనలు గుర్తించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో పలుచోట్ల సోదాలు చేపట్టారు. గతంలో జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు అనుమానం ఉన్న సబ్‌రిజిస్ట్రార్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై 4 కేసులు నమోదు చేసిన ఏబీసీ... అవినీతికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది.
విశాఖ జగదాంబ సెంటర్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహనరావు నివాసంతో పాటు సిబ్బంది ఇళ్లలో ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. రామ్‌నగర్ శారదా టవర్స్‌లోని మోహన్‌రావు నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన పత్రాలు గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, అటెండర్ ఆనంద్‌కుమార్ ఇళ్లలో చెరో రూ.కోటి విలువైన ఆస్తులు గుర్తించామని, వీటిపై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
విజయనగరం ఎస్‌వీఎన్ నగర్‌లో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పాండిలపల్లి రామకృష్ణ ఇంట్లో జరిపిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలతో పాటు నివాసంలో రూ.30,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న భోగాపురంలోని ఆలేటి కనకరాజు నివాసం నుంచి రూ18.10 లక్షల నగదు, 550 గ్రాముల బంగారు, 937 గ్రాముల వెండి ఆభరణాలు, కీలక పత్రాలు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ నివాసంలో రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ అశోక్, సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
అనంతపురం జిల్లా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని రాజహంస గోల్డెన్ హోమ్స్‌లో ఉంటున్న చిలమత్తూరు ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లో తనిఖీలు చేశారు. చిలమత్తూరులో ఉంటున్న ప్రసాద్‌బాబు సహాయకుడు, ప్రైవేటు వ్యక్తి సోమశేఖర్ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేసింది. వీరి ఇళ్లలో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ షేక్ మహమ్మద్‌కు చెందిన భవానీపురంలోని ఆయన ఇంట్లో, జూనియర్ అసిస్టెంట్ డి.పద్మకు చెందిన కొండపల్లిలోని ఆమె నివాసంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది. దాడుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా డి.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్‌గా సాయిరాజును నియమించారు. మిగతాచోట్ల జరిగిన సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి అక్రమార్కులపై చర్యలకు ఏసీబీ ప్రతిపాదించనుందని సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ లంచం డిమాండ్ చేసినా టోల్ ఫ్రీ నం.1064, లేదా 9440440057కు సమాచారం అందించాలని డీజీ అతుల్ సింగ్ సూచించారు.