Malladi Venkata Suryakala: అవినీతి అనకొండ
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:26 AM
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అరెస్టు అయిన ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ...
సింహాచలం ఈవోగా నాడు భారీగా ఆర్జించిన సూర్యకళ
సెటిల్‌మెంట్లలో సొంత లాభం.. దేవదాయ శాఖకు నష్టం
ఏపీఎంఐడీసీ జీఎం ఆస్తులపై 2 రోజులుగా ఏసీబీ సోదాలు
స్థలాలు, భవనాలు, సాగు భూములు సహా 27 స్థిరాస్తులు
విజయనగరం ఆర్డీవోగానూ చక్కబెట్టారని ఆరోపణలు
విశాఖపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అరెస్టు అయిన ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఐడీసీ) జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళ పెద్ద అవినీతి అనకొండ అని ఏసీబీ అధికారులు తేల్చినట్టు సమాచారం. నాలుగేళ్ల క్రితం సింహాచలం దేవస్థానం ఈఓగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అక్రమార్జన చేశారన్న ఆరోపణలను సూర్యకళ ఎదుర్కొంటున్నారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గురు, శుక్రవారాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాటిలో 27 స్థిరాస్తులు బయటపడ్డాయి. ఇళ్ల స్థలాలు, నివాస భవనాలు, వ్యవసాయ భూములతోపాటు రూ.2 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.9 లక్షల నగదు లభించాయి. అవన్నీ వాటి పుస్తక విలువ ప్రకారం రూ.6 కోట్లుగా అధికారులు వెల్లడించారు. మార్కెట్ రేటు చూసుకుంటే రూ.20 కోట్లు వరకు ఉండవచ్చు. సూర్యకళ 2021 మార్చి 4 నుంచి 2022 ఆగస్టు 2 వరకు సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వహించారు. దేవస్థానం భూముల సెటిల్‌మెంట్లు నడిపారని, వాటి ద్వారా కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెంలో పోర్టు స్టేడియం వెనుక సర్వే నంబరు 275లో దేవస్థాన భూములున్నాయి. అందులో కొన్ని దశాబ్దాల క్రితం పలువురు లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించారు. కొందరే క్రమబద్ధీకరణ చేసుకున్నారు. వారు ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాకుల్లో వేర్వేరు ప్లాట్లలో ఉండగా, ఓ 20 మంది ఒకేచోట భూమిని కేటాయించాలని కోరగా, దానికి దేవస్థానం ఆమోదం ఇచ్చేసింది. అలా సుమారు మూడు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం 2022లో ప్రారంభమైంది. దానిపై పలువురు అప్పటి ఈవో సూర్యకళకు ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లలో అపార్టుమెంట్ నిర్మిస్తున్నారని, వాస్తవానికి వారి ప్లాట్లు వేరే దగ్గర ఉన్నాయనేది ఆ ఫిర్యాదుల సారాంశం. ఫిర్యాదు చేసినవారు క్రమబద్ధీకరణ చేసుకోలేదు కాబట్టి అవి ఆక్రమణల కిందకు వస్తాయని సూర్యకళ కొట్టిపారేశారు. బిల్డర్‌కు అనుకూలంగా వ్యవహరించి, భారీగా లబ్ధి పొందారని విమర్శలు వచ్చాయి.
రూ.28 లక్షలు లంచం అడిగారని..
సూర్యకళ సింహాచలం ఈవోగా ఉండగా ఓ భూ వ్యవహారంలో తమను రూ.28 లక్షలు లంచం అడిగారని దేవదాయ శాఖకు ఓ ఫిర్యాదు అందింది. కైలాసపురం డీఎల్‌బీ క్వార్టర్స్ సమీపాన ఉన్న మధుసూదన్‌నగర్‌లో సర్వే నంబర్లు 289/పి, 290/పి, 291/పిలో 13.5 ఎకరాలు కొనుగోలు చేశామంటూ మాధవ్ హిల్స్ ఓనర్స్ అసోసియేషన్ క్లయిమ్ చేయగా, ఆ భూమి తమదనేది దేవస్థానం వాదన. దీనిపై కోర్టులో స్టే మంజూరైంది. దాని ప్రకారం అందులో ఎవరూ పనులు చేపట్టకూడదు. ఆ భూమి విలువ ఫిర్యాదు సమయం నాటికి రూ.250 కోట్లు. అయితే, స్టే ఉండగానే సొసైటీ ప్రతినిధులు ఆ భూమిని చదును చేశారు. ఈ విషయం తెలిసి దేవస్థానం సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే స్టే ఉల్లంఘన కేసు వేయాల్సి ఉంది. సొసైటీకి మేలు చేసేందుకు సిబ్బంది మిన్నకున్నారు. ఈ భూ వివాదంలో అనుకూలంగా వ్యవహరించడానికి సూర్యకళ రూ.28 లక్షలు లంచం డిమాండ్ చేశారంటూ ఆ సొసైటీ కార్యదర్శి ఆర్.వెంకటేశ్వరరావు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై దేవదాయ శాఖ ఆర్‌జేసీ సురేశ్‌బాబు విశాఖ వచ్చి విచారణ నిర్వహించారు. లంచం సొమ్ముతో నర్సీపట్నం ప్రాంతంలో వ్యవసాయ భూములు కొన్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది.
ఎవరు సిఫారసు చేశారో...?
విజయనగరం ఆర్‌డీవోగా ఉన్న ఆమెను కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విజయవాడలో ఏపీఎంఐడీసీ జనరల్ మేనేజర్‌గా సూర్యకళను నియమించారు. సాధారణంగా ఇలాంటి పోస్టుల్లో ఇంజనీరింగ్, ఫార్మసీకి చెందిన అధికారులు ఉంటారు. కానీ ఏరికోరి ఆమెను తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఎవరు ఫిర్యాదుచేశారో గానీ ఆమె వ్యవహారాలపై ఏసీబీ అధికారులు గుట్టుగా సోదాలు నిర్వహించారు. భారీగా ఆస్తులు బయటపడితే ప్రెస్‌మీట్ పెట్టి ఆ వివరాలు వెల్లడిస్తారు. ఈమె విషయంలో అలా చేయలేదు. ముక్తసరిగా నాలుగు వాక్యాలతో ఏసీబీ అధికారులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అక్కడ కూడా ఆమెకు గాడ్‌ఫాదర్ అధికారులు అండగా నిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత ఆలస్యమైనా అవినీతి అధికారిణిని అరెస్టు చేశారంటూ ఆమె బాధితులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఆమెపై ఎంత అభిమానమో..!
అప్పట్లో వైసీపీ నాయకులు దేవదాయ శాఖలో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించుకున్నారు. ఒకరు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి కాగా, మరొకరు సూర్యకళ. ఈమె డిప్యుటేషన్‌పై సింహాచలానికి వచ్చారు. ఇక్కడ వైసీపీ నేతలకు సహకరించారనే ఉద్దేశంతో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆమెను విజయనగరం ఆర్‌డీవోగా బదిలీ చేయించుకుంది. అక్కడ కూడా గత ఎన్నికలకు ముందు భోగాపురం తదితర ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసి నాయకులకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు వచ్చాయి.