Share News

ACB Director General Atul Singh: కొత్త జిల్లాల్లో ఏసీబీ కార్యాలయాలు

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:58 AM

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు వీలుగా కొత్త జిల్లాల్లోనూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయాలు ఏర్పాటు చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు.

ACB Director General Atul Singh: కొత్త జిల్లాల్లో ఏసీబీ కార్యాలయాలు

  • ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది

  • అవినీతిపై 1064 నంబర్‌కు ఫోన్‌ చేయండి

  • ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌సింగ్‌

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు వీలుగా కొత్త జిల్లాల్లోనూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయాలు ఏర్పాటు చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు. విశాఖ వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఏసీబీ కార్యాలయాలు పనిచేస్తున్నాయన్నారు. దీనివల్ల అవినీతి అధికారులు, లంచం డిమాండ్‌ చేసే ఉద్యోగులపై ఏసీబీకి ఫిర్యాదు చేయాలంటే సుదూర ప్రాంతాల నుంచి పాత జిల్లా కేంద్రాలకు రావాల్సి వస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కూడా ఏసీబీ కార్యాలయాలు అందుబాటులోకి తెస్తే అవినీతి నిరోధానికి ఉపకరిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ ట్రాప్‌లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల సంఖ్య తగ్గినమాట వాస్తవమేనని అతుల్‌సింగ్‌ అంగీకరించారు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాసరావు రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేయడంతో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారుల్లో కలవరం మొదలైందన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టగలిగితే ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసే వారికి అవినీతికి పాల్పడితే జీవితం రోడ్డున పడుతుందనే సందేశం వెళుతుందన్నారు. అవినీతి అఽధికారులు, ఉద్యోగులకు సంబంధించిన సమాచారంతో పాటు శిక్షపడేలా చేసేందుకు అవసరమైన ఆధారాలు సంపాదించేందుకు క్షేత్రస్థాయిలో దృష్టిపెట్టామన్నారు. అందులోభాగంగా ప్రజలు ఏసీబీకి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు టెక్నాలజీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పత్రికలు, సోషల్‌ మీడియాలో అధికారులు, ఉద్యోగుల అవినీతిపై వచ్చే కథనాలు, సమాచారం ఆధారంగా వారి ఆన్‌లైన్‌ ఖాతాల్లో డబ్బు ఖర్చు, షాపింగ్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించామన్నారు. ఏసీబీలో సిబ్బంది కొరత ఉండటం కూడా కేసులు తగ్గుదలకు ఒక కారణమని అతుల్‌సింగ్‌ అంగీకరించారు.


ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. ఏసీబీలో పనిచేసేందుకు సమర్థులైన అధికారులు ఆసక్తి చూపడం లేదని, దీనివల్ల ఏసీబీలో ఉన్నాసరే ఆశించిన స్థాయిలో పనిచేసే వారి సంఖ్య తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతి అధికారుల గురించి ఎవరికైనా సమాచారం ఉన్నా, చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్‌ చేసినా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినా 1064 ఏసీబీ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సమాచారం తానే స్వయంగా తీసుకుంటాను కాబట్టి, అవినీతిపరులు తప్పించుకునేందుకు వీలుండదన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 05:00 AM